బీజేపీకి గ్యాస్‌ బండ దెబ్బ ఖాయం

Telangana: Harish Rao Comments On Gellu Srinivas - Sakshi

మంత్రి హరీశ్‌రావు  

సిలిండర్‌పై మరో రూ.200 పెంచబోతున్నారు 

మేం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం 

బీజేపీ నిరాశలో కూరుకుపోయింది 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఈనెల 30న జరిగే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ నెత్తిన గ్యాస్‌ సిలిండర్‌ దెబ్బ పడటం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ విజయం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే పలు సంస్థలు, మీడియా విభాగాలు చేసిన సర్వేలు టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని తేల్చాయన్నారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.

ప్రజాసంక్షేమం, పథకాలు, అభివృద్ధి తదితర విషయాల్లో తాము ప్రజలకు చేసిన మేలును మాత్రమే చెప్పామన్నారు. కానీ.. బీజేపీ నేతలు కూల్చేస్తాం, చీల్చేస్తాం, బద్దలు కొడుతాం అంటూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. పెరుగుతున్న గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించేందుకు ఏమైనా హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లుగా నవంబరు 2వ తేదీ తరువాత సిలిండర్‌పై  మరో రూ.200 పెంచబోతున్నారని ఆరోపించారు.

ఈ ప్రచారం మొత్తంలో ప్రజలకు బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వకపోగా దళితబంధుపై లేఖలు రాసి ఆపేసిందని ధ్వజమెత్తారు. తాము రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో రైతు, పేదల సంక్షేమానికి పట్టం కట్టామన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంలో రైతుల పాలిట శాపంగా మారిన నల్లచట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం– టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేశాయో బేరీజు వేసుకుని ఓటేయాలని కోరారు.

బీజేపీ అంటే కోతలు.. వాతలే 
‘బీజేపీ అంటే ప్రజా సంక్షేమ పథకాల సబ్సిడీల్లో కోతలు, ప్రజలపై పన్నుల వాతలు’అని మంత్రి హరీశ్‌ ఎద్దేవా చేశారు. ఈ ఏడేళ్లలో పెట్రోలు, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచి జనం నడ్డి విరిచారన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఉద్యోగులను రోడ్డుకీడ్చారన్నారు. కరీంనగర్‌–జమ్మికుంట–హుజూరాబాద్‌ రైల్వేలైన్‌ను ఆపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బానిస అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఎట్లా అంటారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ అహంకారానికి, బీసీలపై వ్యతిరేకతకు నిదర్శనమని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చే మీడియా కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులను నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. హుజూరాబాద్‌లో అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top