
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారు.చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంది. విశాఖలో లులు కంపెనీకి కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టాడు. గతంలో విజయవాడ స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశాడు. అప్పుడు నేను హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజీవ్ గాంధీ పార్క్‌ను అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని చూశాడు. కెనాల్ గెస్ట్ హౌస్ నాలుగు ఎకరాలు టూరిజం పేరుతో గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాడు. 200 కోట్ల రూపాయల స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడు.
చంద్రబాబు ఎవరి చెవిలో పువ్వులు పెడతాడు. డీమార్ట్, రిలయన్స్‌కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా?. విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది. చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నాడు. అమరావతికి 34వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి. రైతులు, వ్యవసాయం అంటే చంద్రబాబుకు లెక్కలేదు. ప్రస్తుతం చేసిన భూముల కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
