మొన్న గవర్నర్‌.. నేడు బుగ్గనపై గురి!

TDP Barriers at Every Step to Budget Speech to Minister Buggana - Sakshi

బడ్జెట్‌ ప్రసంగానికి అడుగడుగునా టీడీపీ అడ్డంకులు

రన్నింగ్‌ కామెంటరీతో  పది నిమిషాలు నిలిచిపోయిన ప్రసంగం

విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌ తమ్మినేని

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రసంగానికి ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గవర్నర్‌ ప్రసంగ సమయంలో వ్యవహరించిన మాదిరిగానే మరోసారి అడ్డంకులు కల్పించేందుకు విపక్షం పక్కా ప్రణాళికతో సభకు వచ్చింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్లకార్డులు, కాగితాలు పంచడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, అనగాని సత్యప్రసాద్‌ రన్నింగ్‌ కామెంటరీ చేస్తూ బడ్జెట్‌ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు.

పిల్లలు, మహిళా సంక్షేమం గురించి బుగ్గన బడ్జెట్‌ ప్రతిపాదనలు చదువుతున్న తరుణంలో వీరాంజనేయ స్వామి రన్నింగ్‌ కామెంటరీ చేయడంతో అధికార పార్టీ సభ్యులు గట్టిగా బదులు ఇచ్చారు. ఈ దశలో సభాపతి జోక్యం చేసుకుని  రన్నింగ్‌ కామెంటరీ సరికాదని హెచ్చరించారు. ఏదైనా చెప్పదల్చు కుంటే బడ్జెట్‌పై చర్చలో చెప్పవచ్చని టీడీపీ సభ్యులకు సూచించారు. ఆర్థికమంత్రి బుగ్గన కొద్దిసేపు తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆపి టీడీపీ సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. మొన్న గవర్న ర్‌పై దాడి చేశారని, ఇప్పుడు బడ్జెట్‌పై అందులోనూ మహిళా సంక్షేమంపై మాట్లాడుతుంటే విపక్షం వ్యవహరిస్తున్న తీరు వారి ఆలోచనా విధానాన్ని తెలియచేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రసంగానికి దాదాపు పది నిమిషాలు అంతరాయం కలిగింది. 

చదవండి: (మరో ముందడుగు: రూ.2,56,256.56 కోట్లతో వార్షిక బడ్జెట్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top