‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి | EPS Accuses TVK Of Political Conspiracy And MLA Defections Amid Tamil Nadu Power Struggle | Sakshi
Sakshi News home page

‘‘పుష్ప’’ సినిమాలో చేసినట్లు ఇలా చేస్తున్నారు: పళనిస్వామి

May 25 2026 9:37 PM | Updated on May 26 2026 2:36 PM

Tamil Nadu politics EPS alleges Pre planned conspiracy

న్యూఢిల్లీ:  అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అధికార పార్టీ టీవీకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 126 చోట్ల ప్రజలు విజయ్‌ టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కొన్ని పార్టీల వద్దకు వెళ్లి మద్దతు కోరారని విమర్శించారు.

“అదే కాకుండా, ‘పుష్ప’ సినిమా శైలిలో సోఫా చేతిలో పట్టుకుని వెళ్లినట్టు.. అన్నాడీఎంకే తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారి మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నించారు. ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఇదేనా నిజాయితీగల రాజకీయ నాయకుడి ప్రవర్తన అని ప్రశ్నిస్తున్నారు” అని పేర్కొన్నారు. కాగా, పుష్ప సినిమాలో సోఫాల్లో హీరో డబ్బుల కట్టలు పంపుతాడు.

తమిళనాడులో ఈ ఘటనను “ముందే పన్నిన కుట్ర”గా ఈపీఎస్‌ పేర్కొన్నారు. రాజీనామాలు, టీవీకేలో చేరికలు సచివాలయం లోపలే సమన్వయంతో జరిగాయని పళనిస్వామి ఆరోపించారు. “సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో రాజీనామా లేఖలు ఆమోదిస్తుండగా, ఫస్ట్ ఫ్లోర్‌లో మంత్రి చేతుల మీదుగా సభ్యత్వ కార్డులు ఇచ్చారు” అని చెప్పారు. దీంతో ఇది ముందే పన్నిన కుట్ర అని, బేరసారాల రాజకీయాలు బయటపడ్డాయని ఈపీఎస్ అన్నారు.

ఇలాంటి మోసపూరిత చర్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్తవని, ఎన్నో ద్రోహాలు, వెన్నెపోట్లను ఏఐఏడీఎంకే ఎదుర్కొని నిలబడిందని చెప్పారు. విజయ్‌పై ఈపీఎస్‌ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. “సినిమా ప్రముఖుడి గుర్తును” ప్రజలు తిరస్కరించడంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారని అన్నారు. టీవీకే విజిల్ గుర్తును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇతరుల భుజాలపై ఎక్కి ప్రయాణిస్తున్న వారికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు.

అన్నాడీఎంకేలో విభేదాలు మరింత తీవ్రం
ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ రాజీనామాలు మరో ఎదురుదెబ్బగా మారాయి. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం పళనిస్వామికి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణికి మద్దతు ఇస్తోంది.

రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన షణ్ముగం-వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలలో ఉన్నారు. అయితే, మరో పరిణామంలో, తిరుగుబాటు వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం తిరిగి పళనిస్వామి వర్గంలో చేరారు. దీంతో ఈపీఎస్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 27కి పెరిగింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు తర్వాత స్పీకర్‌ను కలిసి, పళనిస్వామి నాయకత్వంలో పనిచేస్తామని లేఖ ఇచ్చారు.

నిబంధనల ప్రకారమే..: స్పీకర్  
బేరసారాల జరిగాయన్న ఆరోపణలపై స్పందించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. తన బాధ్యత రాజీనామా లేఖలు అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడటమేనని చెప్పారు. “సమర్పించిన లేఖలు నిబంధనలకు సరిపోతున్నాయా లేదా మాత్రమే నేను పరిశీలించగలను. బయట ఏం జరుగుతుందో నేను మాట్లాడలేను” అని విలేకరులతో చెప్పారు.

రాజీనామాలు ఆమోదం పొందడంతో, మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో గెలిచి తర్వాత విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో కూడా ఉపఎన్నిక జరగనుంది.

తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, టీవీకేలో చేరడంతో దీనిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఇప్పటికే ఆమోదించారు. దీంతో 234 సభ్యుల అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 47 నుంచి 44కి తగ్గింది. మే 13న విశ్వాస పరీక్షలో సి.జోసఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ కూడా ఉన్నారు.

శరవేగంగా బేరసారాలు: స్టాలిన్‌
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దీనిపై మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. శరవేగంగా బేరసారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మొదట మిత్రపక్షాల మద్దతు కోరిన టీవీకే తర్వాత ఫ్లోర్ టెస్ట్ సమయంలో అన్నాడీఎంకేలోని కొంతమందితో చర్చలు జరిపిందని, చివరకు కొంతమంది అన్నాడీడీఎంకే సభ్యుల రాజీనామాలు చేయించి, వారినే సచివాలయ ప్రాంగణంలో తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపించారు. ఇలాంటి అవమానకర దృశ్యాలు చూడటానికే ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని స్టాలిన్ అన్నారు.

టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌పై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకతంగా వ్యవహరించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని కపటత్వంగా ఉందని పేర్కొన్నారు. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. ఈ ఫిరాయింపులపై “ఆయా రామ్, గయా రామ్” అన్న వ్యాఖ్య చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement