- సొంత పార్టీ నేతల మధ్య చిచ్చు రగిల్చిన ఓటములు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది?
తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.
అన్నాడీఎంకేలో అలజడి
తమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్‌ను షణ్ముగం మంగళవారం కలిశారు.
అస్సాంలోనూ అసంతృప్తి
అస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్ గోగోయి సిబ్‌సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్‌పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్‌కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.
సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.


