మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్‌.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!

Shock To Minister Niranjan Wanaparthy ZP Chairman MPPs Resigns To BRS - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌:  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహి­తులు­గా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆర్‌.­లోక్‌నాథ్‌ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నా­రు.

ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కె­లాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీ­నామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితో­పాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరు­గురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపస­ర్పం­­చ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్న­ట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్‌ఎస్‌ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లా­డుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మ­గౌరవం కోరు­కుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూ­డా ఆత్మగౌరవాన్ని పొందలేకపో­యామని ఆవేద­న వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో ఆత్మగౌరవాన్ని తా­కట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం
పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు.  ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజక­వర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్‌ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్‌ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top