Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 30న థరూర్ నామినేషన్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ ఎంపీ శశి థరూర్ సెప్టెంబర్ 30న నామినేషన్ వేసే అవకాశముంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను థరూర్ ప్రతినిధి స్వీకరించారు. ఆయన దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా సంతకాలు సేకరిస్తారని సమాచారం. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో థరూర్ తలపడనున్నారు.
పోటీలో అశోక్ గెహ్లాట్..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే!