ఇంద్రసేనారెడ్డి ఏం చేస్తున్నారు?.. బీజేపీ హైకమాండ్‌ లైట్‌ తీసుకుందా?

Senior Leader Nallu Indrasena Reddy Is Not Preferred By BJP High Command - Sakshi

ఎంత సీనియర్ నాయకుడికైనా కొంతకాలం తర్వాత రాజకీయంగా ముగింపు దశ వస్తుంది. ఒక్కసారి కాలపరిమితి ముగిసిపోతే తిరిగి వెనక్కి రావడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కమలం పార్టీలో ఓ సీనియర్ నేత ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నేతను కాషాయ పార్టీ హైకమాండ్‌ పట్టించుకోవడంలేదట. 

గతం ఘనం.. వర్తమానం నిశబ్దం
కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ అయినా కమలం పార్టీ అయినా ఎందరో మహా మహులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు నాయకులకు ఎక్స్‌పైరీ డేట్ త్వరగా వచ్చేస్తుంది. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి అదే పరిస్థితి ఎదురయ్యిందట. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినపుడు అసెంబ్లీలో పార్టీ లీడర్‌గా ఆయన సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్‌నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ నేతను కమలదళం పెద్దలు లైట్ తీసుకుంటున్నారట.

పెద్ద పదవుల్లో తోటి వాళ్లు
ఇంద్రసేనారెడ్డి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా అవకాశాలు వచ్చాయి. ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ లక్ష్మణ్‌కు.. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా ప్రమోషన్ కల్పించారు. వెంకయ్య నాయుడితో పాటు విద్యార్థి దశ నుంచి ఇంద్రసేనారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో పనిచేశారు. 73 ఏళ్ల వయస్సున్న ఇంద్రసేనారెడ్డికి పార్టీలో ఇక భవిష్యత్ లేదా? అన్న చర్చ సాగుతోంది. ఆయన సీనియారిటీ, అందించిన సేవలకు పార్టీ నుంచి ఎలాంటి గౌరవం లభించదా అనే డిస్కషన్ నడుస్తోంది.
చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!

గుర్తిస్తుందా? పదవులిస్తారా?
ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒకరోజు ముందు ఇంద్రసేనారెడ్డికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు. పార్టీలో చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు. అయితే కొత్తగా పార్టీలో చేరేవారికి భరోసా ఇవ్వడం, చేరికల కమిటీ సభ్యులను ఒప్పించడం తన వల్ల కాదని ముక్కుసూటిగా చెప్పేశారాయన. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి మాత్రం నిత్యం టచ్‌లో ఉంటూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అవినీతిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరి భవిష్యత్‌లో ఆయన సేవలను పార్టీ వాడుకుంటుందో ? వదిలేస్తుందో? కాలమే నిర్ణయిస్తుంది.
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top