ఎన్ని‘కలల’ ఎజెండాలు | Public issues coming to fore during upcoming TS assembly elections | Sakshi
Sakshi News home page

ఎన్ని‘కలల’ ఎజెండాలు

Sep 25 2023 3:45 AM | Updated on Sep 25 2023 3:45 AM

Public issues coming to fore during upcoming TS assembly elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక­లు సమీపిస్తున్న వేళ ప్రజల దీర్ఘకాల డిమాండ్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెరపైకి వ­సు­్త­న్నాయి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఆదివాసీ గిరిజనులు, గ్రామీణ కూలీలు.. ఇలా పలు వర్గాల సంబంధిత అంశాలు చర్చ­కు వ­స్తున్నాయి. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, ఆహార భద్రతల కోణంలో ఎజెండాల రూపకల్పనకు ప్రజా సంఘాలు ప్రయత్నిస్తోంటే.. ఆ­యా డిమాండ్లు, సమస్యల ప్రాతిపదికగా తమ పార్టీ­ల మేనిఫెస్టోలు తయారు చేసేందుకు, ప్రజలను మరోసారి ఆశల పల్లకీలో ఊరేగించేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి.  

అన్ని వర్గాల ప్రయోజనాలే లక్ష్యం 
ఈసారి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే వర్గాల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా కొత్త, పాత డిమాండ్లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైతాంగం, మహిళలు, నిరుద్యోగుల పక్షాన గళం వినిపిస్తోంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పరిహారం, బీమా, పెట్టుబడి సాయం లాంటి పథకాల అమలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన భారీ బహిరంగ సభలో కౌలు రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం ఇస్తామనే వాగ్దానాన్ని కాంగ్రెస్‌ పార్టీ చేసింది.

మిగిలిన పార్టీలు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి. ఆదివాసీ పోడు రైతులు, మహిళా రైతులు, దేవాదాయ భూములను సాగు చేసే వారికి కూడా పెట్టుబడి సాయం పథకం అమలు డిమాండ్‌ విన్పిస్తోంది. మద్దతు ధరల గ్యారంటీ చట్టం అమలు, కేవలం వరి ధాన్యమే కాకుండా పప్పు, చిరు ధాన్యాల సేకరణ, ప్రతి మండలానికి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్, సాగు, పశుపోషణ ఆధారిత కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు లాంటి అంశాలతో పాటు మహిళలు, నిరుద్యోగులకు ఆసరాగా ఉండే పథకాలను అమలు చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

వీటితో పాటు గ్రామీణ ఉపాధి చట్టం పకడ్బందీ అమలు, రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ, నకిలీ విత్తనాల నిరోధానికి ప్రత్యేక చట్టం, అసైన్డ్‌ భూములపై హక్కులు, అటవీ హక్కుల అమలు లాంటి దీర్ఘకాలిక డిమాండ్లు కూడా మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. ఇక భూమి సంబంధిత సమస్యలు, ముఖ్యంగా ధరణి పోర్టల్‌ను ప్రజా సంఘాలు, పార్టీలు తమ ఎజెండాలో చేర్చుతున్నాయి.

ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ అంటుంటే,  అలా అంటున్న కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని బీఆర్‌ఎస్, మెరుగైన రెవెన్యూ విధానాన్ని తెస్తామంటూ బీజేపీ ‘ధరణి’ని ఒక ప్రధాన అంశంగా చేసుకుని ముందుకు వెళుతున్నాయి. ఆసరా పింఛన్లు, రైతుల పెట్టుబడి సాయం, ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు, గిరిజన బంధు, మహిళలకు ప్రత్యేక నగదు సాయం, గ్యాస్‌ సిలిండర్ల ధరల తగ్గింపు, ఉద్యోగాల భర్తీ లాంటి వాటిని అ్రస్తాలుగా చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేనిఫెస్టోల్లో ఆయా సమస్యలు, అంశాలను చేర్చడంపై దృష్టి పెడుతున్నాయి. 

రైతు స్వరాజ్య వేదిక ఎజెండాపై చర్చ 
రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రైతు స్వరాజ్య వేదిక తన ఎజెండాను రాజకీయ పార్టీల ముందుకు తెచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశమైన వేదిక ప్రతినిధులు.. తమ డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. త్వరలోనే బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలను కలిసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

కౌలు రైతుల గుర్తింపు, రైతుబంధు పథకం అమలు, పంటల సేకరణ, మద్దతు ధరలు, మార్కెటింగ్, రైతు ఆదాయం పెంపు, వ్యవసాయ మార్కెట్‌ యార్డుల విస్తరణ, గ్రామీణ పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ కుటుంబాల కోసం ప్రత్యేక కమిషన్, వాస్తవ సాగుదారులకే రుణాలు, రాష్ట్ర స్థాయి విత్తన చట్టం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టానికి సాయం, పంటల బీమా, భూ సమస్యలు, ధరణి పోర్టల్‌ వినియోగం, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల హక్కులు, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజలందరికీ ఆహార, ఆరోగ్య, సామాజిక భద్రత తదితర అంశాలతో రూపొందిన ఈ ఎజెండా చర్చనీయాంశమవుతోంది.  

తెరపైకి వస్తున్న డిమాండ్లు ఇవే.. 
► గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ విధ్వంసానికి, మహిళలపై హింసకు, మగవారి అకాల మరణాలకు కారణమవుతోన్న బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేయాలి. మద్య నియంత్రణను అమలు చేయాలి. హరియాణ తరహాలో మద్యం విక్రయాలు, ఉత్పత్తిని నిషేధించే అధికారాలను గ్రామ పంచాయతీలకు ఇస్తూ చట్టం చేయాలి.  
► ఇంటర్మీడియట్‌ స్థాయి వరకూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వర్తింపజేయాలి.  
► అర్హులైన అన్ని గ్రామీణ కుటుంబాలకు రేషన్‌కార్డులివ్వాలి. ఆహార భద్రతా చట్టం మేరకు చిరుధాన్యాలను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలి.  
► రాష్ట్ర సగటు కనీస వేతనంలో 50 శాతాన్ని ఆసరా పింఛన్‌ కింద అందజేయాలి. కుటుంబంలో ఒకరికి కాకుండా అర్హులైన వృద్ధులకు అందేలా చర్యలు తీసుకోవాలి.  
► విద్యుత్‌ షాక్, పిడుగుపాటు, అడవి జంతువుల దాడి బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి.  

అధ్యయనాల్లో నిమగ్నం 
అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలతో పాటు కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు పలు కోణాల్లో లెక్కలు వేసుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోలను రూపొందిస్తున్నాయి. ఎలాంటి అంశాలను చేర్చాలి? ఎలాంటి హామీలు ఇవ్వడం ద్వారా తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందో అధ్యయనం చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే రైతు, యువత కోసం డిక్లరేషన్‌లను ప్రకటించడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేలా ఆరు గ్యారంటీల పేరుతో ఆరు హామీలు ప్రకటించింది. ఇక బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రజలకు భారీ నజరానా ప్రకటిస్తారనే విధంగా మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా, ఈ రెండు పార్టీలకు దీటుగా మేనిఫెస్టో రూపకల్పనలో కమలనాథులు నిమగ్నం అయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement