Rajya Sabha Nominated MPs 2022: రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు

PT Usha Vijayendra Prasad Ilayaraja Nominated For Rajya Sabha - Sakshi

రాజ్యసభకు నాలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖులను నామినేట్‌ చేసిన కేంద్రం 

పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్గడే, విజయేంద్ర ప్రసాద్‌కు అవకాశం

అభినందనలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ 

న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకొని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్న భారతీయ జనతా పార్టీ అందులో భాగంగా మరో అస్త్రం సంధించింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్‌ పీటీ ఉషా, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను పార్లమెంట్‌ ఎగువసభకు నామినేట్‌ చేసింది.

పెద్దల సభలో అడుగుపెట్టబోతున్న నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. సంబంధిత రంగాల్లో వారు అందించిన సేవలను కొనియాడారు. పీటీ ఉషా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేశారు. ఇళయరాజా మధురమైన సంగీతంతో ప్రజలను రంజింపజేశారని గుర్తుచేశారు. భిన్నతరాల ప్రజలు ఆయన సంగీతాన్ని ఆస్వాదించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌కు సృజనాత్మక ప్రపంచంతో దశాబ్దాల అనుబంధం ఉందని, భారతదేశ ఘనమైన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేయడం గమనార్హం.

పాటల ‘పెద్ద’రాజా

‘పచ్చని చేల పావడ గట్టి...కొండమల్లెలే కొప్పున బెట్టి.. వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని..’వంటి అత్యద్భుత గీతానికి అంతే అద్భుతంగా బాణీలు సమకూర్చి పాటకు అమృతత్వాన్ని సాధించిపెట్టారు ఇళయరాజా. ఇలాంటి పాటలెన్నో ఆయన పాటల పూదోటలో అలా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పాటలోని ‘పచ్చని చేల’కు ఇళయరాజా జీవితానికి మధ్య సంబంధం ఎంతో బలమైంది. ఇళయరాజాకు పాటపై మక్కువ ఏర్పడింది, ఆయన్ను సంగీతం వైపు అడుగులేయించింది ఈ పచ్చని చేలల్లో రైతులు, కూలీలు పాడే పాటలే. 

‘అన్నక్కిళి’తర్వాత బిజీ 
సంగీత కచేరీల్లో పాల్గొంటూ మరోవైపు పశ్చిమ బెంగాల్‌కి చెందిన సలీల్‌ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా చేశారు ఇళయరాజా. కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్‌ దగ్గర దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా చేశారు. ఇక తమిళ చిత్రం ‘అన్నక్కిళి’తో (1976)తో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా మారారు. ‘అన్నక్కిళి’నిర్మాత పంజు అరుణాచలం రాజాకి ‘ఇళయ’(యంగ్‌ అని అర్థం) అని చేర్చి ‘ఇళయరాజా’గా మార్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లిష్‌ భాషల్లో దాదాపు 1,500 చిత్రాలకు 7 వేల పాటలకు పైగా స్వరపరిచారు ఇళయరాజా. 2010లో భారత ప్రభుత్వం ఇళయరాజాను ‘పద్మభూషణ్‌‘, 2018లో ‘పద్మ విభూషణ్‌‘పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, తమిళ చిత్రం ‘సింధుభైరవి’, మలయాళ ‘పళసి రాజా’చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు.   

మధురైలోని పన్నైపురమ్‌లో జననం
1943 జూన్‌ 3న తమిళనాడులోని మధురైలో గల పన్నైపురమ్‌లో రామస్వామి, చిన్నతాయమ్మాళ్‌ దంపతులకు మూడవ సంతానంగా జ్ఞాన దేశిగన్‌ (ఇళయరాజా) జన్మించారు. స్కూల్లో చేర్చేటప్పుడు ‘రాసయ్యా’అని మార్చారు. 14వ ఏటనే ఇళయరాజాకి సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దాంతో సోదరుడు పావలార్‌ వరదరాజన్‌ నిర్వహించే సంగీత బృందంతో ఊరూరూ తిరుగుతూ కచేరీలు ఇచ్చేవారు. ఆ సమయంలోనే భారతదేశపు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు నివాళిగా తమిళ కవి కన్నదాసన్‌ రాసిన పాటకు బాణీ కట్టారు. తీవ్ర వేదనతో సాగే ఈ పాట ఎంతోమంది మనసుల్ని కదిలించింది. 1968లో మద్రాసులో ధన్‌రాజ్‌ మాస్టర్‌ వద్ద సంగీతం అభ్యసించారు. ధన్‌రాజ్‌ మాస్టర్‌ రాసయ్యా పేరుని ‘రాజా’గా మార్చారు. 

రాజ్యసభకు ‘కథ’ల బాహుబలి

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా నామినేట్‌ అయిన ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్‌ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో 1942 మే 27న జన్మించారు. ఆయన పూర్తిపేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్‌. కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్ణణంలో చదువుకున్న విజయేంద్ర ప్రసాద్‌ తన అన్నయ్యతో కలసి విశాఖపట్టణంలో కాంట్రాక్ట్‌ పనులు చేసేవారు. అక్కడే రాజనందినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో ఉన్న తన దగ్గరి బంధువు, అన్నయ్య అయిన పాటల రచయిత శివశక్తి దత్తా (సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి) వద్దకు చేరారు. దర్శకుడు రాఘవేంద్రరావు వద్ద విజయేంద్ర ప్రసాద్‌ని అసిస్టెంట్‌ రైటర్‌గా చేర్పించారు శివశక్తి దత్తా. మూడేళ్లు అసిస్టెంట్‌ రైటర్‌గా చేసిన ఆయన శివశక్తి దత్తాతో కలిసి ‘జానకి రాముడు’సినిమాకి తొలిసారి కథ రాశారు. ‘బంగారు కుటుంబం’, ‘బొబ్బిలి సింహం’సినిమాలకు కథలు రాశారు. ‘బొబ్బిలి సింహం’చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు కథలు అందించారు.

‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రాలకు కథలు అందించారు. 1996లో అన్నయ్య శివశక్తి దత్తాతో కలిసి ‘అర్ధాంగి’, ‘శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ’చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘రాజన్న’చిత్రానికి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నంది అవార్డు అందుకున్నారు. హిందీ ‘బజరంగీ భాయీజాన్‌’సినిమాకి బెస్ట్‌ స్టోరీ విభాగంలో ‘ఫిల్మ్‌ఫేర్‌’తో పాటు, ‘ది ఐకానిక్‌ ట్రేడ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015’, ‘సోనీ గిల్డ్‌ 2016’అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ సతీమణి రాజనందిని 2012 అక్టోబర్‌ 21న మరణించారు. ఆయనకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు. ‘‘విజయేంద్రప్రసాద్‌ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేశాయి. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు’’అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.  

సమాజ సేవే శ్వాసగా.. లక్షల మందికి ఆరాధ్యుడు డాక్టర్‌ వీరేంద్ర హెగ్గడే
 

కర్ణాటకలోని ప్రఖ్యాత ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలోనూ విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన డాక్టర్‌ వీరేంద్ర హెగ్గడేను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. ఆయన 1948 నవంబర్‌ 25న దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్‌లో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమ్మ, రత్నవర్మ హెగ్గడే. వీరేంద్ర హెగ్గడేకు భార్య హేమావతి హెగ్గడే, కుమార్తె శ్రద్ధ హెగ్గడే ఉన్నారు. విద్యాభ్యాసం అనంతరం కేవలం 20 ఏళ్ల వయసులో 1968 అక్టోబర్‌ 24న ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా(పాలకుడు) బాధ్యతలు స్వీకరించారు. గత ఐదు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

గ్రామీణాభివృద్ధి, ప్రజల స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రూరల్‌ డెవలప్‌మెంట్, సెల్ఫ్‌–ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఆర్‌డీఎస్‌ఈటీఐ)ని నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి తగిన శిక్షణ అందిస్తున్నారు. అలాగే కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 6 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. 49 లక్షల మందికిపైగా సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్‌ ట్రస్టును డాక్టర్‌ హెగ్గడే నెలకొల్పారు. 25కు పైగా పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యనందిస్తున్నారు. హెగ్గడేకు ధర్మరత్న, ధర్మభూషణ అనే పేర్లు కూడా ఉన్నాయి. లక్షలాది మందికి ఆరాధ్యుడిగా కొనసాగుతున్నారు.    

పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం 

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్‌ గర్ల్‌’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ.

ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్‌ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్‌ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యింది. 

ఇళయరాజాపై అభినందనల వర్షం  
రాజ్యసభకు వెళ్లబోతున్న సంగీత దిగ్గజం ఇళయరాజాపై అభినందనల వర్షం కురుస్తోంది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభినందనలు తెలిపారు. అసాధారణ సంగీత కళాకారుడు ఇళయరాజా వివిధ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారని రాజ్‌భవన్‌ ట్వీట్‌ చేసింది. ప్రియమైన మిత్రుడు ఇళయరాజాకు అభినందనలు అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఇళయరాజాను ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్‌ కూడా అభినందించారు.  

దేశాన్ని గర్వపడేలా చేశారు: అమిత్‌ షా  
ప్రముఖులు పీటీ ఉషా, ఇళయరాజా, డాక్టర్‌ వీరేంద్ర హెగ్గడే,విజయేంద్ర ప్రసాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అభినందనలు తెలియజేశారు. అంకితభావం, నిరంతర శ్రమతో వారు దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఎగువ సభకు వెళ్లబోతున్న వారికి అభినందనలు తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top