Ponguleti Srinivasa Reddy Joins In Congress Party - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి పొంగులేటి.. ప్రకటన అప్పుడే..?

Published Fri, Jun 9 2023 2:52 AM

ponguleti srinivasareddy joins congress - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ తొలగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు చేసుకుంటున్న ఆయన.. తనతో కలిసి వచ్చే ఇతర నాయకులతో కలిసి ఈనెల 12న ఆ పార్టీలో చేరికపై ప్రకటన చేయనున్నారు. పొంగులేటి శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఖమ్మంలో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు తెలిసింది. 

జనవరి నుంచే జోరుగా చర్చ 
ఈ ఏడాది జనవరి ఒకటిన బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ధిక్కారస్వరం వినిపించినప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. ఆయన మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటానంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తాను ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారని పొంగులేటి చెబుతూ వస్తున్నారు. మొత్తం మీద ఐదు నెలలుగా పొంగులేటి ప్రజల మధ్యే ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆతీ్మయ సమ్మేళనాలతో పాటు ఇతర ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దృష్టి సారించారు. మేలో రైతు భరోసా ర్యాలీ, పోడు రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడంతో పాటు యువత కోసం భారీ స్థాయిలో జాబ్‌మేళా ఏర్పాటు చేశారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ యత్నాలు.. 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసీఆర్‌ వ్యతిరేకులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి పయనించేందుకు పొంగులేటి సిద్ధమయ్యారు. ఇతర జిల్లాల్లోని అసంతృప్త నేతలతోనూ చర్చలు జరిపారు. బీజేపీలో చేరాలా లేక కాంగ్రెస్‌లో చేరాలా.. ఏ పార్టీలో చేరకుండా సొంత కూటమి ఏర్పాటు చేయాలా? అనే అంశంపై చర్చలు జరిగాయి. అయితే ఖమ్మం జిల్లాలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. పలు దఫాలు పొంగులేటితో చర్చలు జరపగా, మే 4న బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖమ్మంలో పొంగులేటి, జూపల్లిని కలిశారు. అనంతరం హైదరాబాద్‌లోనూ వీరు సమావేశమైనట్లు ప్రచారం జరిగింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనూ చర్చలు జరిగినట్లు సమాచారం. కాగా స్థానిక పరిస్థితులు, ఇతర అన్ని అంశాలనూ బేరీజు వేసుకున్న ఆయన కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

అనుచరుల నిర్ణయం మేరకు.. 
ఖమ్మం ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం ఉదయం 7.30కి మొదలయ్యే సమావేశానికి పది నియోజకవర్గాల నుంచి 200 మంది చొప్పున హాజరు కావాల్సిందిగా ఆయన అనుచరులకు సమాచారం అందింది. ఈ భేటీలో అభిప్రాయాలు సేకరించాక వారి నిర్ణయం మేరకు అడుగులు వేస్తానని పొంగులేటి చెప్పినట్లు తెలిసింది. కాగా ఈనెల 12న తన చేరిక విషయమై ప్రకటన చేస్తారని, ఈనెల 28 తర్వాత ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభలో అనుచర గణంతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని సమాచారం. 

Advertisement
Advertisement