సాక్షి, తాడేపల్లి: అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పేరుతో చంద్రబాబు జనం సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు 21 వేల కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్ చేశారు.
‘‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా?. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.
‘‘వైఎస్ జగనే అమరావతికి న్యాయం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయి. అమరావతిపై వైఎస్ జగన్‌కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు. రాజధానిలో పేదలు లేకుంటే ఎలా అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు.


