సీమ ద్రోహి చంద్రబాబు | Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

సీమ ద్రోహి చంద్రబాబు

Apr 1 2026 3:50 AM | Updated on Apr 1 2026 3:50 AM

Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

మదనపల్లె: నాలుగుసార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించిన చిత్తూరు జిల్లా ప్రయోజ­నా­లను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని రైతులను ప్రశ్నించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ లిఫ్ట్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా గోదావరి జలాలు, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం ద్వారా కృష్ణా జలాలు రాయలసీమ రైతులకు అందకుండా చంద్రబాబు ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. 

చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం తప్ప ప్రేమ లేదన్నారు. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటంతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి 40 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకునేలా కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తాకట్టుపెట్టి అన్యాయం చేస్తుంటే రైతులు చూస్తూ ఊరుకుంటే ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి రైతులు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉందన్నారు. 

లిఫ్ట్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయని వీటిని స్వయంగా తాము పరిశీలించినట్టు చెప్పారు. మిగిలిన పనులు పూర్తయితే రాయలసీమకు సాగు కష్టాలు తీరుతాయన్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తరలించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని, ఈ విషయం అక్కడ ప్రజలే చెబుతున్నారని అన్నారు. రాయలసీమ నిధులను ఎవరబ్బ సొత్తని అమరావతి రాజధాని కోసం తరలిస్తున్నారని ప్రశ్నించారు. చదరపు అడుగు నిర్మాణ ధర రూ.6,500 ఉంటే.. ఏ ధరలు పెరిగాయని రూ.11,500 పెంచి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

సీమకు ప్రమాద ఘంటికలు
రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు సాధన కో–ఆర్డినేటర్‌ సాకే శైలజానా«థ్‌ మాట్లాడుతూ.. సీమ ప్రాంతానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అల్మట్టితో 200 టీఎంసీలు నిలిచిపోతాయని, కృష్ణాకు అందాల్సిన 100 టీఎంసీలు దక్కవన్నారు. అప్పర్‌ భద్ర, తుంగ ద్వారా 30 టిఎంసీల నీళ్లు ఆగిపోతాయన్నారు. ఈ జలాలు ఆగిపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిరాక ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. నీటి సమస్యపై మాట్లాడితే చంద్రబాబు నోరుమెదపరన్నారు. 

శ్రీశైలంలో మిగిలే 21 టీఎంసీల బురద నీళ్లే అంటున్న చంద్రబాబుకు ఆ బురదనీటి విలువ ఏమిటో తంబళ్లపల్లె, అనంతపురం ప్రాంతాల రైతులను అడిగితే తెలుస్తుందన్నారు. రాయలసీమకు నీళ్లు రావడం, పొలాలు పండటం చంద్రబాబుకు ఇష్టముండదన్నారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి, తిప్పారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిసార్‌ అహ్మద్, మైనార్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఇక్బాల్‌ ఆహ్మద్‌ మాట్లాడుతూ.. రాయలసీమ పథకాన్ని పూర్తి చేయించుకునేందుకు చంద్రబాబు దిగివచ్చేలా పోరాటం సాగించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement