అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి

Ongole: War Between Damacharla Brothers as Venue of Mahanadu - Sakshi

ఇంటా..బయట దామచర్లకు అసమ్మతి సెగ 

మహానాడు వేదికగా దామచర్ల సోదరుల మధ్య వార్‌ 

తాజాగా కొత్తపట్నం మండలంలో జనార్దన్‌పై తిరగబడిన సొంత పార్టీ నేతలు 

దామచర్లను ఇంటిలోకి కూడా రానివ్వని టీడీపీ నేత 

జనార్దన్‌ తీరుపై మండిపడుతున్న మత్స్యకారులు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతోంది. మహానాడు వేదికగా అన్నదమ్ముల మధ్య ఫ్లెక్సీల వివాదం జనార్దన్‌ను అప్రతిష్టపాలు చేయగా.. తాజాగా కొత్తపట్నం మండలంలోని మత్స్యకార నేతలు ఆయన తీరుపై భగ్గుమంటున్నారు.  అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు సొంతింటిలోనే అసమ్మతి కుంపటితో దామచర్ల తలపట్టుకుంటున్నారు. కేడర్‌ చేజారిపోకుండా నానా తంటాలు పడుతున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. మహానాడు వేదికగా  సోదరుడితో గొడవలు బహిర్గతమై అందరిలో నవ్వుల పాలైన మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఇప్పుడు చివరకు ద్వితీయ శ్రేణి నాయకుల ఛీత్కారాలకు గురవుతున్నారు. అసలే అంతంత మాత్రంగా పార్టీ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక వైపు సొంతింటి సెగ, మరో వైపు పార్టీలో అసమ్మతిరాగం దామచర్ల రాజకీయ భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చింది. మహానాడు ఫ్లెక్సీల ఏర్పాటులో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదాలు పార్టీ పరువు తీశాయంటూ ఓవైపు టీడీపీ అధిష్టానం దామచర్లపై గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసారి టికెట్టు తనకే కావాలంటూ సోదరుడు సత్య కేడర్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌ జారిపోకుండా నానా తంటాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యే దామచర్లకు పార్టీ నేతల్లో పెళ్లుబుకుతున్న అసమ్మతి రాగం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మహానాడుతో వాపును చూసి బలుపు అనుకుంటున్న దామచర్ల సొంత పార్టీ నేతల్లో నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితిపై ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు దామచర్ల కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. అవి కూడా బెడిసి కొడుతుండటంతో భంగపాటుకు గురవుతున్నారు. కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి తద్వారా లబ్ధిపొందాలని చేస్తున్న ప్రయత్నాలు అతనికి తీవ్ర తలనొప్పి తెచ్చి పెడుతుండటంతో పార్టీ అధిష్టానం వద్ద పట్టుకోల్పోతున్నారనే చర్చ సాగుతోంది.  

మహానాడు సందర్భంగా ఫ్లెక్సీలు పీకేస్తున్నారంటూ లేని పోని ఆరోపణలు చేసి భంగపడిన దామచర్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో ఇక తన పనైపోయిందని గ్రహించి కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. అల్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గొడవలు సృష్టించి ప్రజల నుంచి వైఎస్సార్‌ సీపీకి, బాలినేనికి వ్యతిరేకత వస్తుందని చూపించే కుట్రకు తెర తీశారు. టీడీపీకి చెందిన నాయకులను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వద్దకు పంపి ఓ మహిళను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు దిగారు. దీన్ని బాలినేని దీటుగా తిప్పికొట్టడంతో టీడీపీ నేతలు తోకముడిచారు. ఏదో ఒక విధంగా కుయుక్తులు పన్ని ప్రజల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ వరుసగా బెడిసికొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడు.

తాజాగా కొత్తపట్నం మండలం మడనూరులో మత్స్యకారుల వర్గానికి చెందిన ఓ సీనియర్‌ టీడీపీ నేతకు తెలియకుండా ఓ శుభకార్యానికి హాజరవడంతో ఆ పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. తమకు తెలియకుండా గ్రామంలోకి ఎలా వస్తారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దామచర్ల వద్దకు వెళ్లకుండా ఆగిపోయారు. ఈ వ్యవహారం బెడిసి కొట్టిందని గ్రహించిన దామచర్ల సదరు నాయకుని ఇంటికి వెళ్లేందుకు యత్నించగా కనీసం ఇంట్లోకి కూడా రాకుండా అడ్డుకుని తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడంతో చేసేది లేక అక్కడి నుంచి జారుకున్నారు. దామచర్ల నిర్వాకంపై సదరు నేత మత్స్యకార వర్గానికి చెందిన వారితో అసమ్మతి కుంపటి రాజేస్తుండటంతో ఈ విషయం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది ఏకమై దామచర్లపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళుతుందనే ప్రచారం సాగుతోంది. 

ఒకవైపు ఒంగోలు నగర శివారులోని యరజర్ల వద్ద రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు 25 వేల ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రభుత్వ భూమిని సిద్ధం చేయగా, కోర్టు ద్వారా దాన్ని దామచర్ల ఆపించారని తెలుసుకున్న నిరుపేదలు అతనిని తీవ్రస్థాయిలో ఛీత్కరించుకున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు సొంతిటిలోనే అసమ్మతి కుంపటి రాజుకుంది. అయ్యే జనార్దనా... ఏమిటి నీ పరిస్థితి అంటూ.. సొంత  పార్టీ నాయకులే నవ్వుకుంటున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top