రసవత్తరంగా నిజామాబాద్‌ రాజకీయాలు

Nizamabad MLC elections: Corporator Baikan Sudha Back To BJP - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.. ఇక ఎన్నికల వేళ అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా నిజామాబాద్‌  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు కూడా నాటకీయ పరిణామాలు, చేరికలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌ కొనసాగుతోంది. దీంతో  మొన్న (సోమవారం) గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ కార్పొరేటర్ నేడు (బుధవారం) మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.

44వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధ మొన్న హైదరాబాద్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇవాళ మళ్లీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య రాష్ట్ర నాయకుడు సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో చెప్పుకోవచ్చు.(ఎమ్మెల్సీగా ఉంటారా.. మంత్రివర్గంలో చేరతారా?)

ఈ నెల 9న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్లు వేసే ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్‌కే సింహభాగం ఉన్నారు. అయినా చేరికలకు అధికార పార్టీ అడ్డు చెప్పలేదు. భారీ మెజార్టీతో కవిత కల్వకుంట్లను గెలిపించాలని లక్ష్యంతో ముందుకు దూసుకు పోతుంది. ఇప్పటివరకూ నిజామాబాద్‌లో 8మంది బీజేపీ కార్పొరేటర్లు, ఒక జడ్పీటీసీ, మరో కాంగ్రెస్ కార్పొరేటర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. నిన్న ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆధ్వర్యంలో  కామారెడ్డి మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్  చాట్ల రాజేశ్వర్, మరో ఇద్దరు 19 వ వార్డు కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్, 32 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పంపరి లత తదితరులు ఇవాళ కారు ఎక్కారు. పోలింగ్‌కు గడువు సమీపించడంతో ఆయా మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను శనివారమే క్యాంప్‌కు తరలించారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తుండడంతో ఆమెకు మద్దతుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను క్యాంప్‌నకు పంపించారు. (ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదే : కేటీఆర్‌)

9వ తేదీన పోలింగ్ నిర్వహణ సందర్భంగా పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో ఉన్న కార్యాలయాలకు, సంస్థలకు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న కార్యాలయాలకు, సంస్థలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా క​లెక్టర్‌ శరత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top