బీజేపీ అడ్డాలో పోటీకి నితీశ్ సై.. అఖిలేశ్ యాదవ్ మద్దతు! | Nitish Kumar To Contest 2024 Polls From Uttar Pradesh Phulpur | Sakshi
Sakshi News home page

బీజేపీని దెబ్బకొట్టేందుకు నితీశ్ మాస్టర్ ప్లాన్‌.. 2024లో అక్కడి నుంచి పోటీ!

Sep 17 2022 9:33 PM | Updated on Sep 17 2022 9:33 PM

Nitish Kumar To Contest 2024 Polls From Uttar Pradesh Phulpur - Sakshi

ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌.. నితీశ్ కుమార్‌కు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా నితీశ్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతునిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం

సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎ‍న్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్. అయితే ఆ పార్టీ వర్గాల్లో మాత్రం ఓ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్ స్వయంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఫూల్‌పుర్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌.. నితీశ్ కుమార్‌కు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా నితీశ్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతునిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. నితీశ్ ఫూల్‌పుర్‌ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగాలని జేడీయూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ కూడా ఈ విషయంపై ఇప్పటికే హింట్ ఇచ్చారు. నితీశ్ కుమార్ 2024 లోకసభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయవచ్చన్నారు. ఫూల్‌పుర్‌తో  పాటు అంబేడ్కర్ నగర్, మిర్జాపూర్‌ లోక్‌సభ స్థానాల నుంచి కూడా ఆయనకు ఆఫర్ ఉన్నట్లు చెప్పారు. అయితే నితీశ్ పోటీ చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

80 స్థానాలు..
ఉత్తర్‌ప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రాష్ట్రమే ఎంతో కీలకం. యూపీలో ప్రస్తుతం బీజేపీకి 65 మంది ఎంపీలున్నారు. అందుకే ఇక్కడ ఆ పార్టీని దెబ్బతీసేందుకు నితీశ్ వ్యూహా రచన చేస్తున్నట్లు సమాచారం. అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తే బీజేపీకి 15-20 స్థానాలకే పరిమితం చేయవచ్చని లలన్‌ సింగ్ చెబుతున్నారు.

అలబాహాద్‌లోని ఫూల్‌పుర్ నియోజకవర్గం ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. మోదీని ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్న నితీశ్.. ఆ లక్ష‍్యాన్ని సాధించాలంటే యూపీలో ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మోదీని సవాల్ చేయడం అంత సులభం కాదని అంటున్నారు.
చదవండి: బీజేపీ హర్ట్ అయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement