బెంగాల్ ప్రకంపనలు.. ఇక్కడా కనిపిస్తున్నాయ్
వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తాం
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
పశ్చిమ బెంగాల్ గాలి ఇక్కడ కూడా బలంగా వీస్తోంది
అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విశ్వాసఘాతుకం, కుటుంబ రాజకీయాల పట్ల ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారు
విభజన రాజకీయ శక్తులకు అడ్డా కాంగ్రెస్...
కాంగ్రెస్‌ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ (ఎంఎంసీ)’గా అభివర్ణించిన మోదీ
‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా..’ అంటూ ప్రసంగం మొదలు
బెంగాల్‌లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్‌కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్‌గవర్నెన్స్ మోడల్‌పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు.
బీజేపీ అభివృద్ధి మోడల్‌పై విశ్వాసం
దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్‌లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. 
ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
కాంగ్రెస్‌ది విభజన రాజకీయం
కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్‌వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు.


