మునుగోడులో అంతర్గత విభేదాలపై టీఆర్‌ఎస్ దృష్టి.. నవంబర్‌ తర్వాతే ఉపఎన్నిక అని లెక్కలు 

Munugode Politics TRS Focus on Internal Issues - Sakshi

మంత్రి జగదీశ్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, రవీంద్రకుమార్‌కు బాధ్యత

ప్రాధాన్యత దక్కని ద్వితీయ శ్రేణి నాయకుల బుజ్జగింపు యత్నాలు

క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దిన తరువాతే అభ్యర్థి ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు శాసనసభా సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదిస్తూ స్పీకర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయం కాగా... ఈ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగే పరిస్థితి లేదని.. అక్టోబర్, నవంబర్‌లో ఉప ఎన్నికకు అవకాశం ఉండొచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, పకడ్బందీగా ఉప పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

2014లో టీఆర్‌ఎస్‌ గెలుచుకున్న మునుగోడు సీటు 2018 ఎన్నికల్లో ‘హస్త’గతమైంది. కానీ రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అందుకోసం హడావుడి నిర్ణయాల జోలికి వెళ్లవద్దని, అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరో ఏడాదిలో వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు మునుగోడును దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ‘పాజిటివ్‌ వేవ్స్‌’పంపాలన్న కృతనిశ్చయంతో ఉంది. స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా గట్టుప్పల్‌ను మండలంగా చేసిన ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగా పెండింగ్‌ ప్రాజెక్టులు, ప్రజావసరాలకు అనుగుణంగా మరికొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. అదే సమయంలో పార్టీ పరంగా కూడా ఆచితూచి వ్యవహరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.  

కొత్త చేరికలు.. అసంతృప్తులకు బుజ్జగింపులు... 
మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమని తెలిసినప్పటి నుంచే మండలాలు, గ్రామాల వారీగా పార్టీ బలాబలాలపై నజర్‌ పెట్టినట్లు సమాచారం. గ్రామాలను, మండలాలను ప్రభావితం చేయగల ఇతర పార్టీలోని నాయకులను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరుతున్నా, ఆయన   వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపని కాంగ్రెస్‌ అనుచరవర్గానికి గులాబీ గాలం వేస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన స్థానిక బలమైన కేడర్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

అలాగే పార్టీలో కొందరు జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీటీసీలు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించిన అధిష్టానం వారిని హైదరాబాద్‌ పిలిపించి బుజ్జగించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను రవీందర్‌రావు, రవీంద్రకు మార్‌కు అప్పగించింది. ఇక ఎమ్మెల్యే టికెట్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి    ఉండగా, ఎవరినీ ఫోకస్‌ చేయకుండా పార్టీ పరిస్థితిని   చక్కదిద్దిన తరువాతే అభ్యర్థి ఎవరో ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలిసింది.  

పార్టీ బలోపేతంపై సీఎం ప్రత్యేక నజర్‌... 
మునుగోడులో 2014 ఎన్నికల్లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. కోమటిరెడ్డి కుటుంబ ప్రాబల్యం, కాంగ్రెస్‌ పట్ల అనుకూలతతో పాటు ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పట్ల కొంత ప్రతికూలత జనాల్లో వ్యక్తమైనట్లు పార్టీ గుర్తించింది. పార్టీలో విభేదాలూ ఓటమికి కారణమని తేలింది. ఈ నేపథ్యంలో తొలుత పార్టీలో విభేదాలను పరిష్కరించి, మండలాల స్థాయి నుంచి పార్టీని అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతలను సీఎం కేసీఆర్‌ అప్పగించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ బలంతో పాటు అంతర్గత విభేదాలు, ఇతర పార్టీల బలాబలాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓటమికి ప్రభావం చూపిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది.
చదవండి: బీజేపీ ఉరకలు.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష.. టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top