Munugode Bypoll: గూగుల్‌ పే ఓకేనా.. ఫోన్‌ పే చేయాలా?

Munugode Bypoll: Digital Transactions in Vote Buying - Sakshi

ఓట్ల కొనుగోళ్లలో డిజిటల్‌ లావాదేవీలు 

ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఓ పార్టీ బూత్‌ ఇన్‌చార్జులు  

బంగారం ఇస్తామంటూ మరోపార్టీ ఇన్‌చార్జుల ప్రలోభాలు  

పది మంది యువకులు ఉంటే గోవా ట్రిప్‌ 

మునుగోడు ఎన్నికల్లో విచిత్రాలు

సాక్షి, నల్లగొండ/చౌటుప్పల్‌రూరల్‌: ఓట్ల కొనుగోళ్లలోనూ డిజిటల్‌ లావాదేవీలు వచ్చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులువేస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఓటర్లకు గతంలో మద్యం, డబ్బులు ఆశగా చూపి తమవైపు మళ్లించుకునే పార్టీలు ఈ ఉపఎన్నికలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ బూత్‌ వారీగా నియమించిన ఇన్‌చార్జులు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లను కలుస్తూ డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లిస్తున్నారు.

నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్న బూత్‌ ఇన్‌చార్జులు, సహ ఇన్‌చార్జులు.. రోజువారీ గా ఎంత మంది ఓటర్లను కలిశారు.. ఎవరెవరిని కలిశారన్న వివరాలను రాష్ట్ర పార్టీకి చేరవేస్తున్నారు. వారితో ఫొటోలు దిగి వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ ఎవరెవరికి ఉంది.. గూగుల్‌ పే ఎవరికి ఉంది.. ఫోన్‌ పే ఎవరికి ఉందన్న వివరాలనూ పంపుతున్నారు. తమకు కేటాయించిన ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారు అడగకముందే హామీలిచ్చి తమవైపు మళ్లించుకుంటున్నారు. చౌటుప్పల్‌ ప్రచారంలో ఈ సందడి నెలకొంది.  

ఫోన్‌పే, గూగుల్‌పే లేదంటే... 
ఫోన్‌పే, గోగుల్‌ పే లేనివారికి నగదు రూపంలోనే డబ్బులు అందించేలా ఆ పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. అవి రెండు ఉన్నవారికి మాత్రం ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసేలా వారి ఫోన్‌ నంబర్లను రాసి పెట్టుకుంటున్నారు. ఇతర ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్‌కు రప్పించేలా వారితో ఫోన్‌లో మాట్లాడి ఒప్పిస్తున్నారు. అలాంటి వారికి ముందుగానే ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  

గోవా ట్రిప్‌ కోసం.. 
యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. చౌటుప్పల్‌ మండలంలోని ఓ గ్రామంలో ఓ పార్టీ గోవా ట్రిప్‌కు ప్లాన్‌ చేస్తోందని సమాచారం. 10మంది యువకులు ఉండి, పార్టీ కండువాలు కప్పుకుంటే రూ.10 వేల చొప్పున ఖర్చులకు ఇచ్చి, విమానంలో వెళ్లి వచ్చేలా టికెట్లు ఇప్పించనున్నారని తెలిసింది. ఈ ఆఫర్‌కు 2గ్రూపులు ముందుకు వచ్చాయని సమాచారం. వచ్చే నాలుగైదు రోజుల్లో గోవాకు వెళ్లొచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

నగదు రూపంలో అడ్వాన్స్‌లు 
ఓటర్లకు ఓ పార్టీ నగదు రూపంలో అడ్వాన్స్‌లిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన లీడర్లు తమ ఊళ్లలో అధిక ఓట్లను సాధించి, అభ్యర్థి మెప్పుపొందేందుకు ఓ గ్రామంలో ఓటర్లకు అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. దసరా పండుగ రోజు కొన్ని కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఇచ్చిన నాయకులు.. ఎన్నికలప్పుడు అవతలి పార్టీ వారు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. 

తటస్థంగా ఉంటేనే మేలని.. 
పార్టీ కండువా కప్పుకొని తిరిగితే ఒక పార్టీ వారే డబ్బులు ఇస్తారని అదే తటస్థంగా ఉంటే మూడు పార్టీలు ఇస్తాయనే ఆలోచనల్లో కొంతమంది చోటామోటా నాయకులున్నారు. చౌటుప్పల్‌ మండలంలోని జైకేసారం గ్రామంలో ఇప్పటిదాకా రాజకీయాల్లో తిరిగిన ఓ చోటా నాయకుడు ఇప్పుడు ఆ పార్టీ వైపు వెళ్లడం లేదు. రూ.5 లక్షలిస్తే పార్టీలో తిరుగుతా అని చెబుతున్నాడట. ఇది తెలిసిన ఓ పార్టీ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top