జయంతి శెట్టి ముందు ఎమ్మెల్యే సాష్టాంగ నమస్కారం | MLA Gururaj Gantihole Bows Before Jayanti Shetty to Seek Her Blessings | Sakshi
Sakshi News home page

జయంతి శెట్టి ముందు ఎమ్మెల్యే సాష్టాంగ నమస్కారం

Apr 28 2026 9:26 PM | Updated on Apr 28 2026 9:28 PM

MLA Gururaj Gantihole Bows Before Jayanti Shetty to Seek Her Blessings

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని ఉడుపి జిల్లా బైందూర్ తాలూకా శిరూర్ ప్రభుత్వ పాఠశాల.గతేడాది ఈ పాఠశాల పదోతరగతి ఫలితాల్లో విద్యార్థులు కేవలం 35శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ ఏడాది అదే పాఠశాల విద్యార్థులు 94శాతం ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మొత్తం 53 మంది విద్యార్థులలో 50 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2 మంది డిస్టింక్షన్, 29 మంది ఫస్ట్ క్లాస్ సాధించారు.

ఈ ఫలితాల వెనుక ప్రధాన కారణం ఉపాధ్యాయుల కృషి. ముఖ్యంగా వైస్ ప్రిన్సిపాల్, సైన్స్ టీచర్ జయంతి శెట్టి ప్రతిరోజూ సాయంత్రం 5:30 వరకు అదనపు తరగతులు నిర్వహించారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రుల మద్దతు పొందేందుకు ఆమె స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. ఈ విధంగా పాఠశాల, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి చేసిన ప్రయత్నం ఊహించని విజయాన్ని తీసుకొచ్చింది.

విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని గుర్తించిన బైందూర్ ఎమ్మెల్యే గురురాజ్ గంటిహోలే పాఠశాలను సందర్శించారు. ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి, జయంతి శెట్టి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది.

గతేడాది బైందూర్ పదోతరగతి పేలవమైన ఫలితాలపై జిల్లా పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఎమ్మెల్యే గురురాజ్ సమీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయులు విద్యార్థుల ఫలితాలు మెరుగుపరచాలని కోరారు. అదే సమయంలో విధుల్లో భాగంగా జయంతి శెట్టి ఈ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆమె కృషి ఫలితంగా విద్యార్థులు ఊహించని విజయాన్ని సాధించారు.

కర్ణాటక పదోతరగతి ఫలితాల్లో ఈసారి 94.1శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత సంవత్సరం 80శాతం నుండి ఇది గణనీయమైన పెరుగుదల. అనేక పాఠశాలలు 100శాతం ఫలితాలను సాధించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement