కిషన్‌రెడ్డిది ప్రజావంచన యాత్ర: జగదీశ్‌రెడ్డి

Minister Jagadish Reddy Has Criticized Union Minister Kishan Reddy - Sakshi

అబద్ధాలాడటం బీజేపీ నేతలకు అలవాటేనని విమర్శ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజాఆశీర్వాద యాత్ర’పేరిట ప్రజలను మోసం చేసే యాత్ర నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రూ.70 ఉన్న పెట్రోలు, డీజిల్‌ ధరను రూ.100 దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలి.

కిషన్‌రెడ్డి తన యాత్రలో వాస్తవాలను కాకుండా గాలిమాటలు చెప్తున్నారు’అని మంత్రి విమర్శించారు. ‘నల్లడబ్బును రప్పిస్తామన్న ప్రధాని మోదీ మాటలు విని ప్రజలు తెల్లడబ్బు కూడా పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల సామాజిక పింఛన్లు ఇస్తున్నారా? కనీసం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనైనా అమలు చేస్తున్నారా’అని నిలదీశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి దేశ ప్రజలు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతుల జేబులు కొట్టేందుకు తెస్తున్న కొత్త చట్టాలతో రైతాంగం నడ్డి విరుగుతోందని అన్నారు.  

మహారాష్ట్ర, కర్ణాటకవాసులు కూడా కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారు... 
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ పార్లమెంటులో ఒకలా, బయట మరోలా మాట్లాడుతోందని, తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలకు సాధ్యం కాదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘చట్టబద్ధంగా వచ్చిన నిధులు మినహా అదనంగా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారు’అని మంత్రి అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి సరిహద్దుల వద్ద కాపలా కాయడం చేతకాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఎద్దేవా చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top