సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అజారుద్దీన్ కౌంటరిచ్చారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తనను దేశ ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అజారుద్దీన్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కిషన్ రెడ్డి.. మీరేం మాట్లాడుతున్నారు. నా గురించి మీకు ఏం తెలుసు. నేను హిందూ, ముస్లిం అన్ని వర్గాల వాడిని.. అందరివాడిని. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసింది. దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన నేను దేశ ద్రోహినా?. నా దేశభక్తిపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్‌లోకి తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం ఏ శాఖలు ఇచ్చినా సంతోషమే.. నాకు ఇవి ఇవ్వాలని నేను అడగడం లేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు.
కిషన్‌రెడ్డి ఆరోపణలు..
ఇక, అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అజారుద్దీన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దేశ ద్రోహానికి పాల్పడి భారత్‌కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
టీపీసీసీ విమర్శలు..
మరోవైపు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. తాజాగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. అజారుద్దీన్‌పై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ఫైర్ అయ్యారు. అజార్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మూడు నెలల ముందే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ కాలం దేశానికి ఆయన సేవలందించారని, ఈ నేపథ్యంలో అజార్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్‌గా దేశానికి అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించి పెట్టారని, ఎంపీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలోని మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.


