Hyderabad Old City: ఎంఐఎం ఇలాకాలో కాషాయ జెండా రెపరెపలు సాధ్యమా? టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరేనా!

MIM Eyes Clean Sweep Hyderabad Old City Assembly Segments TRS Candidates - Sakshi

హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాలు  మారుతాయా? మజ్లీస్‌కోటను ఎవరైనా ఢీకొట్టగలరా? మజ్లీస్‌కు దూరమైన కాంగ్రెస్‌ వ్యూహమేంటి? మిత్రపక్షానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌అభ్యర్థులు బరిలో దిగుతారా? క‌మ‌లద‌ళం చార్మినార్ పై జెండా ఎగురవేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
 
నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఒరిజినల్‌ హైదరాబాద్‌ నగరాన్ని ఇప్పుడు పాతబస్తీ అని పిలుస్తున్నారు. నలు దిక్కులా విస్తరించిన మహా నగరానికి గుండెకాయలాంటి పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లీస్‌పార్టీ పాగా వేసింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏడు లేదా 8 స్థానాలు మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడా అసదుద్దీన్‌ నాయకత్వంలోని ఎంఐఎం రెడీగా ఉంది. 

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలున్న  ఏడు స్థానాలు మావే అంటున్నారు ఎంఐఎం నేత‌లు. చార్మినార్‌, యాకుత్‌పుర , చంద్రాయ‌ణ గుట్ట, నాంప‌ల్లి, కార్వాన్, బ‌హ‌దూర్ పుర, మ‌ల‌క్ పేట్ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలు. ఈ సెగ్మెంట్లలో మ‌రో పార్టీ గెల‌వాలంటే బాగా శ్రమించాల్సిందే. ఈ సారి ఎలాగైనా త‌మ బ‌లాన్ని చూపాల‌ని బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గ‌ట్టి ప్రయ‌త్నాలే చేస్తున్నాయి .

నాంప‌ల్లిలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరంటే! 
నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌అభ్యర్ది ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎం అభ్యర్ది జాఫ‌ర్ హుస్సేన్ 9 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఈ సారి నాంపల్లి నుంచి ఎలాగైనా గెల‌వాల‌ని కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అవ‌కాశం ఉంది. బీజేపి నుంచి దేవ‌ర క‌రుణాక‌ర్ మ‌ళ్ళీ పోటీ చేస్తార‌ని తెలుస్తుంది. టిఆర్ఎస్‌ నుంచి ఆనంద్  కుమార్ పోటీలో ఉండొచ్చని సమాచారం. 

చార్‌మినార్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి లోధి
చార్‌మినార్‌నియోజకవర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపి అభ్యర్ది ఉమా మ‌హేంద్రపై ఎంఐఎం అభ్యర్ధి ముంతాజ్ అహ్మద్ ఖాన్ 32 వేల మెజారిటితో గెలుపోందారు. ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, టిఆర్ఎస్‌నుంచి మ‌హ్మద్ స‌లాహుద్దీన్ లోధి, కాంగ్రేస్ నుంచి  టీ పిసీసీ సెక్రట‌రి షేక్ ముజ‌బ్, బీజేపి నుంచి ఉమా మ‌హేంద్రలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంది.

చాంద్రాయ‌ణ గుట్టలో అది అసాధ్యమా?
చాంద్రాయ‌ణ గుట్ట సెగ్మెంట్ లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపి అభ్యర్ది స‌య్యద్ షాహెజాదిపై ఎంఐఎం అభ్యర్ది అక్బరుద్దిన్ ఓవైసీ 80 వేల ఓట్ల  మెజారిటితో విజయం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఎంఐఎం నుంచి అక్బరుద్దిన్ ఓవైసీ, బీజేపి నుంచి షాహెజాది, టిఆర్ఏస్ నుంచి సీతారామ్ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి బినోబైద్ మిస్త్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎంబీటీకి పట్టున్న చాంద్రాయణగుట్టలో కూడా ఎంఐఎం పాతుకుపోయింది. ఇక్కడ అక్బరుద్దీన్‌ను ఓడించడం అసాధ్యమనే వాదన కూడా ఉంది.

హ‌జ‌రి, యూస‌ఫ్‌లలో ఒకరు పోటీలో పక్కా!
కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపి అభ్యర్ది అమ‌ర్ సింగ్ పై ఎంఐఎం అభ్యర్ది  కౌస‌ర్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎం నుంచి కౌస‌ర్, బీజేపి నుంచి అమ‌ర్ సింగ్, టీఆర్ఎస్ నుంచి మ‌హ్మద్ అల్ హ‌జ‌రి, అప్సర్ యూస‌ఫ్ జాహిల‌లో ఓక‌రు పోటీ చేసే అవ‌కాశం ఉది.
(చదవండి: సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్‌)

సంతోష్ కుమార్‌కు మరో అవకాశం?
మ‌ల‌క్ పేట నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బ‌లాల 30 వేల మెజారిటితో గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎం నుంచి బ‌లాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడనున్నట్లు స‌మాచారం. కాంగ్రెస్ నుంచి సంగిరెడ్డి , చెక్కిలోక‌ర్ శ్రీనివాస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఏస్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చావా సంతోష్ కుమార్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంది.

యాకుత్ పురలో ఖాద్రితో పోటీకి దిగేది ఎవరో? 
యాకుత్ పుర నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టిఆర్‌ఎస్‌అభ్యర్ది సామ సుంద‌ర్ రావు పై 47 వేల ఓట్ల మెజారిటితో ఎంఐఎం అభ్యర్ది పాషా ఖాద్రి గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ, టిఆర్ఎస్ నుంచి సుంద‌ర్ రావు , బీజేపి నుంచి రూప్ రాజ్, కాంగ్రెస్‌ నుంచి రాజేంద‌ర్ రాజు, కోట్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు .

బ‌హ‌దూర్ పుర భారీ మెజారిటీతో ఎంఐఎం 
బ‌హ‌దూర్ పుర నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ అభ్యర్ది అలీ బ‌క్రీ పై ఎంఐఎం అభ్యర్ది మోజం ఖాన్ 80 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంఐఎం నుంచి మోజం ఖాన్, టిఆర్ఏస్ నుంచి అలీ బ‌క్రీ , కాంగ్రెస్‌నుంచి క‌లీం బాబ, బీజేపి నుంచి అనీఫ్ అలీ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు.

పాతబస్తీలోని 7 అసెంబ్లీ సీట్లపై బీజేపి, కాంగ్రెస్‌, టిఆర్ఎస్ ‌పార్టీలకు పెద్దగా ఆశ‌లు లేన‌ప్పటికి అక్కడ గట్టి పోటీ ఇవ్వటం ద్వారా... ఇతర సీట్లపై దృష్టి పెట్టకుండా మ‌జ్లిస్‌ను పాత‌బ‌స్తికే ప‌రిమితం చేయొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో పాత బ‌స్తిలో బోణీ కోట్టాల‌నే ప‌ట్టుద‌లను‌కూడా ప్రదర్శిస్తున్నాయి. మ‌జ్లిస్ మాత్రం ఈ 7 సీట్లతో పాటు రాజేంద్రన‌గ‌ర్ , జూబ్లిహిల్స్ సీట్లలో కూడా గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. దీంతో పాత‌బ‌స్తీ రాజ‌కీయం రసకందాయంలో పడింది.
(చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్‌.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top