ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్‌లో జన్మించి.. | Lok Sabha Election Arun Govil Has Meerut Connection | Sakshi
Sakshi News home page

Arun Govil: ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్‌లో జన్మించి..

Mar 26 2024 10:40 AM | Updated on Mar 26 2024 2:54 PM

Lok Sabha Election Arun Govil Has Meerut Connection - Sakshi

టీవీ సీరియల్‌ ‘రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన నటుడు అరుణ్ గోవిల్‌ యూపీలోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోగి దిగాడు. అరుణ్ గోవిల్‌కి స్టార్‌డమ్‌తో పాటు మీరఠ్‌తో అనుబంధం కూడా ఉంది. 

అరుణ్ గోవిల్‌ మీరఠ్‌ కాంట్‌లో 1958 జనవరి 12న జన్మించారు. అతని తండ్రి చంద్రప్రకాష్ గోవిల్ మీరట్ మునిసిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజనీర్‌గా పనిచేశారు. అరుణ్ ప్రారంభ విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్‌లో సాగింది. తరువాత ఆయన ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. 

అరుణ్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అతని తండ్రి భావించారు. అయితే అరుణ్‌ నటనారంగంలోకి ప్రవేశించారు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 17  ఏళ్ల వయసులోనే అరుణ్‌ గోవిల్‌ ముంబైకి వెళ్లి నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1977లో హిందీ సినిమా 'పహేలీ' సినిమాలో అరుణ్‌కు అవకాశం దక్కింది. 

అయితే అరుణ్ గోవిల్‌కు ‘రామాయణం’ సీరియల్‌ ఎంతో పేరును తీసుకువచ్చింది. అరుణ్ పోషించిన రాముని పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.  ఆయనను సాక్షాత్తూ రామునిగా చూసినవారు కూడా ఉన్నారట. రామాయణం తర్వాత అరుణ్‌ గోవిల్‌ టీవీ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా మారారు. పలు పౌరాణిక సీరియల్స్‌లో నటించారు. ఇప్పుడు మీరఠ్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన అరుణ్‌ గోవిల్‌ భవితవ్యాన్ని కాలమే తేల్చి చెప్పనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement