తెలంగాణవాది కాదు.. వ్యాధి  | KTR Fires On Revanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణవాది కాదు.. వ్యాధి 

Aug 10 2023 4:24 AM | Updated on Aug 10 2023 4:24 AM

KTR Fires On Revanth Reddy - Sakshi

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నికార్సైన తెలంగాణ వాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్‌ తీసుకొని దాడికి దిగిన రైఫిల్‌రెడ్డి అని దుయ్య బట్టారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి డబ్బు సంచులతో దొరికిన థర్డ్‌ డిగ్రీ దొంగ అని ఆరోపించారు.

తెలంగాణ ప్రాంత రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు, కేసీఆర్‌ మూడు పంటలకు సరిపోయే కరెంటు ఎందుకు ఇస్తున్నారని అన్న వ్యక్తి అని విమర్శించారు. ‘మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్‌ కావాలా? మూడు పంటలకు కరెంటు ఇచ్చే బీఆర్‌ఎస్‌ కావాలా? మతం పేరిట మంటలు పెడుతున్న బీజేపీ కావాలా? ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లే పార్టీలు కావాలా? ఇక్కడే పనిచేసే నాయకుల పాలన కావాలా?’అని ప్రశ్నించారు. 50 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వాలంటోందని, గతంలో పాలించినప్పుడు ఏమి చేసిందని నిలదీశారు.  

ధరలపై మోదీ సమాధానం చెప్పాలి 
మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు సిలిండర్‌ ధర రూ.420కి పెరిగితే నాడు మోదీ అనేక విమర్శలు చేశారని, ప్రస్తుతం అది రూ.1,200కు పెరిగిందని కేటీఆర్‌ చెప్పారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రుడాయిల్‌ ధరలు తగ్గినా మోదీ ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. హిందూ, ముస్లింల మధ్య బీజేపీ తగదాలు పెడుతోందని అన్నారు. వచ్చే ఎన్నికలు ఢిల్లీ బానిసలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌ను ఇష్టారీతిన విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రతి వర్గం సంతోషంగా ఉంది.. 
గతంలో నెర్రలు బారిన నేలలు, నెత్తురోడిన నేలలు, నక్సలైట్‌ల పోరు ఉన్న తెలంగాణ గత తొమ్మిదేళ్లలో తెంతో అభివృద్ధి సాధించిందని కేటీఆర్‌ అన్నారు. చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని, పంటపొలాలు కళకళలాడుతున్నాయని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 60 లక్షల టన్నుల ధాన్యం పండగా, ప్రస్తుతం మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని చెప్పారు. అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రంలో ప్రతి వర్గం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. 

అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.. 
జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌ను, రూ.6.15 కోట్లతో నిర్మించిన ఉపాధి శిక్షణ సంస్థ (న్యాక్‌ భవనం)ను మంత్రి ప్రారంభించారు. రూ.22 కోట్లతో అభివృద్ధి చేసిన రఘునాథ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను, రూ.15.5 కోట్లతో నిర్మించిన మూడు వైకుంఠధామాలను, సమీకృత మార్కెట్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం మున్సిపల్‌ ఉద్యోగులతో కేటీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు. సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement