ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా? | Kommineni Srinivasa Rao Comments On Bharat Ratna Awards, Details Inside - Sakshi
Sakshi News home page

ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?

Published Sun, Feb 11 2024 3:25 PM

Kommineni Srinivasa Rao Comment On Bharat Ratna Awards - Sakshi

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్‌కు  ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి  భారత రత్న ఇచ్చారు.

మాజీ ఉప  ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన  ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన  తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.

ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు.

ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి  అప్పట్లో విబేధాలు వచ్చాయి.

సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్‌ను  తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్‌కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే.

ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ  ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం  హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి  ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. 

పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్‌ఎస్‌ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది.  ఎన్టీఆర్‌ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా ఉండేవారు.

అయినా ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్‌లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని  మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్‌కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్‌లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement