పదవీ త్యాగం.. హైకమాండ్‌ ఎదుట సిద్దరామయ్య డిమాండ్స్‌ | Karnataka Siddaramaiah Political Demands At Congress High Command Amid Leadership Change, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పదవీ త్యాగం.. హైకమాండ్‌ ఎదుట సిద్దరామయ్య డిమాండ్స్‌

May 29 2026 10:39 AM | Updated on May 29 2026 12:53 PM

Karnataka Siddaramiah Political Demands At congress high command

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం దక్కింది. దీంతో, డీకే శివకుమార్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎంగా డీకే శివకుమార్‌ సోమవారం ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇద్దరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న నేపథ్యంలో హైకమాండ్‌ ఎదుటు సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, సిద్దరామయ్య శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీతో సమావేశయ్యారు. ఈ సమావేశంలో సిద్దరామయ్యతో పాటు, ఆయన కుమారుడు యతీంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ సూర్జేవాలా కూడా ఉన్నారు. ఈ సమావేశంలో హైకమాండ్‌ ఎదుట సిద్దరామయ్య పలు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై రాహుల్‌తో సిద్దరామయ్య సమాలోచనలు జరిపారు. సిద్ధూ రాజకీయ భవిష్యత్తుపైనా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాహుల్‌ ముందు సిద్ధరామయ్య పలు డిమాండ్లను ఉంచినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. తన కుమారుడు యతీంద్రకు కీలకమైన మంత్రిత్వశాఖను కేటాయించాలని ఆయన హైకమాండ్‌ను కోరినట్లు తెలిపాయి. తన కుమారుడు యతీంద్రకు వైద్య, విద్య.. వెనుకబడిన తరగతుల వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఆయన అడిగినట్లు సమాచారం. లేదంటే గతంలో డీకే శివకుమార్‌ నిర్వహించిన పరిశ్రమలు, జలవనరుల శాఖ అయినా ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ నియామకాలతో పాటు మంత్రివర్గ పదవుల కేటాయింపులకు సంబంధించి పలువురు నేతల జాబితాను సిద్ధరామయ్య.. రాహుల్‌ గాంధీకి అందజేశారు. ఈ భేటీ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షడు ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు.

అలాగే, కర్ణాటకలో తన పాత్రపై హైకమాండ్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. సిద్దరామయ్యను రాజ్యసభకు పంపించేందుకు రాహుల్‌ గాంధీ ఒప్పించే ప్రయత్నం చేయగా.. రాజ్యసభకు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోనని సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. కాగా, తదుపరి కర్ణాటక ప్రభుత్వంలో సిద్దరామయ్య ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, అహింద వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దరామయ్యకు ప్రభుత్వానికి మార్గదర్శిలా ఉండే పాత్ర కేటాయించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. అధిష్టానం ముందు రెండు వర్గాల బలమైన లాబీయింగ్‌ గట్టిగానే సాగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కొత్త ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండేలా ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. లింగాయత్‌, దళిత వర్గాల నుండి డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశముంది. అనంతరం, కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. రాహుత్‌తో సమావేశంలో చాలా విషయాలు చర్చలకు వచ్చాయి. అంతా సానుకూలంగానే సాగుతోంది. నాయకత్వ మార్పిడిపై ఎలాంటి అడ్డంకులు లేవు అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement