త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా.. లాబీయింగ్‌తో ఎవరైనా పీసీసీ చీఫ్‌ కావొచ్చు!

Jaggarddy Letter To Sonia Gandhi Over His Party Resignation Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ వీడనున్నట్లు ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి శనివారం ఓ లేఖ రాశారు. త్వరలో పార్టీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల లేఖను విడుదల చేశారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాసిన లేఖలోని అంశాలు..

‘నేను పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటాను. కానీ, ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి కాంగ్రెస్ గుంపులో ఉండను.

► త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా.

► కాంగ్రెస్‌లో సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి ఎవరైనా పీసీసీ కావొచ్చు.

► సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారు. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

► గతంలో కాంగ్రెస్‌ పార్టీలో  వివాదాలు ఉన్నా హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు.

► కాంగ్రెస్‌లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తా. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలి.

► 2017లో ఎవ్వరు అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టమంటే.. సభ పెట్టడానికి ముందుకు రాకుంటే నేను సభ నిర్వహించాను. ఆ సభ నుంచి పార్టీ రాష్ట్రంలో బలపడింది. పార్టీ కోసం కష్టపడినా నేనా కోవర్టుని.. సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలు కోవర్టులా?.

► ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పేట్టకుంటే నేను మెదక్ జిల్లా నుంచి అభ్యర్థిని పెట్టి, రూ. కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పార్టీ పరువు నిలిపాను.

► పార్టీ సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు. ఎవరు కోవర్టులు.. అభ్యర్థిని పెట్టినవాళ్లా? లేక పెట్టని వాళ్లా?. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్లు కోవర్టులా? నేనా?.

► గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్లు, స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా? లేక నేనా? అనేది అధిష్టానం గుర్తించాలి’ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top