ఈ నెల 16న కారెక్కనున్న కౌశిక్‌ రెడ్డి.. ఆయనతోపాటు మరొకరు?

Huzurabad: Kaushik Reddy Might Join The TRS On July 16th - Sakshi

కెప్టెన్‌ లక్షికాంతారావుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి భేటీ

ఆయన సైతం టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం

త్వరలో హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహం

మారుతున్న కరీంనగర్‌ రాజకీయాలు 

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ కేంద్రంగా కరీంనగర్‌ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆది, సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరిగాయి. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌ రెడ్డి ఫోన్‌ సంభాషణలు లీక్‌ అయిన వెంటనే వేగంగా పావులు కదిలాయి. కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించుకోవడం జరిగిపోయింది.

ఈ నెల 16న హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇటీవల టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్‌.రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

లక్ష్మికాంతారావుతో పెద్దిరెడ్డి భేటీ
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మికాంతారావుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్దిరెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందగా, వయో భారంతో కెప్టెన్‌ పరామర్శకు వెళ్లలేదు. ఆదివారం పెద్దకర్మ ముగిసిన నేపథ్యంలో సోమవారం పెద్దిరెడ్డి స్వయంగా కెప్టెన్‌ ఇంటికి వెళ్లి 2 గంటల పాటు సమావేశమయ్యారు. హుజూరాబాద్‌ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పెద్దిరెడ్డి బీజేపీ తరఫున ఈసారి పోటీ చేయాలని భావించారు. ఈటల బీజేపీలో చేరడంతో ఆ అవకాశం కోల్పోయిన ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అప్పటి నుంచి అంటీ ముంటనట్టుగానే బీజేపీతో ఉన్న పెద్దిరెడ్డి త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో గతంలో ఉన్న పరిచయాలు, తాజాగా సహచరుడు ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా కారెక్కడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘సాక్షి’ ఆయనను సంప్రదించగా.. ఇప్పటివరకు తనను టీఆర్‌ఎస్‌లోకి ఎవరూ ఆహ్వానించలేదని, పిలుపొస్తే ఆలోచిస్తానని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top