
పీపీటీల పేరిట అజ్ఞానాన్ని చాటుకున్న సీఎం, మంత్రులు
ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా.. అవే తప్పుడు మాటలు
చర్చకు పిలిచే దమ్ము లేక ప్రజాభవన్‌లో సొంత సమావేశం
గౌరవానికి భంగం కలిగించినందుకు ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి రంగంపై చర్చకు రావాలంటూ రంకెలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో బుధవారం నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు ఆహ్వానించలేదని మాజీమంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.
సభ్యుల హక్కులకు భంగం కలిగించినందుకు స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాల పుట్ట అంటూ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం సవాలులో నిజాయితీ ఉంటే బీఆర్‌ఎస్‌ను కూడా ఆహ్వానించి ఉండేవారన్నారు.
ఎన్ని కొరడాలైనా తక్కువే..
‘ఐదు దశాబ్దాలుగా తెలంగాణ నీటి హక్కులను కాలరాసి, గోదావరి, కృష్ణాలో తెలంగాణ వాటాను ఆంధ్రకు అప్పజెప్పిన కాంగ్రెస్‌ను కొట్టేందుకు ఎన్ని కొరడాలైనా సరిపోవు. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్‌ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలో చెప్పాలి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పేరిట కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలతో సీఎం రేవంత్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ తమ అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు.
ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. సీఎం, మంత్రులు చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీ లోపలా, బయటా అనేకసార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించాం. అయినా కుక్క తోక వంకర అన్నట్టు పదే పదే చెప్పిన అబద్ధాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేటు’అని హరీశ్ విమర్శించారు.
పాలమూరు–రంగారెడ్డిపై కుట్రలు
‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్లగొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విషయం గురించి దాచిపెట్టే కుట్ర చేస్తుండు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్‌రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మూలనపడింది.
ప్రాణహిత–చేవెళ్ల తరహాలోనే మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా పండ బెడుతున్నారు. కేవలం 7 టీఎంసీల సామర్థ్యమున్న జూరాలపై అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యం కాదని రేవంత్‌రెడ్డికి తెలియదా.. కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని కాంగ్రెస్ మరణ శాసనం రాయడం వల్లే తెలంగాణ శిక్ష అనుభవిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
నేడు పీసీ ఘోష్ కమిషన్ వద్దకు హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను గురువారం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించేందుకు హరీశ్ సమయాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కలవడానికి కమిషన్ సమయం ఇచ్చింది.