గ్యారంటీల చావు వార్తే | Harish Rao Fires On Congress Party | Sakshi
Sakshi News home page

గ్యారంటీల చావు వార్తే

Jan 18 2024 5:22 AM | Updated on Jan 18 2024 5:22 AM

Harish Rao Fires On Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏటా రూ. 3.5 లక్షల కోట్లు కావాలి. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక సలహదారు చెప్తున్నారు. తెలంగాణలోనూ గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమనే భావనతో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను అరచేతిలో వైకుంఠం చూపేలా తయారు చేసిందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వచ్చే ఆదాయానికి మించిన హామీలను కాంగ్రెస్‌ ఇచ్చిందని, వాటిని నెరవేర్చడం అసాధ్యమని ఆయన తేల్చిచెప్పారు.

తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుని కేవలం నెల రోజుల్లోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్ష, సన్నాహక సమావేశాలు మొదలుపెట్టాం. కార్యకర్తల నుంచి విలువైన సూచనలు అందుతున్నాయి. కార్యకర్తలు కోరుకున్న రీతిలోనే ఇకపై పార్టీ పనిచేస్తుంది.

ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినా అధైర్యపడకుండా పోరాడుదాం. సోషల్‌ మీడియా దు్రష్పచారాల కాలంలో ప్రభుత్వం మారేందుకు బలమైన కారణాలు అవసరం లేదు. కాంగ్రెస్‌తో సహా ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని ఇంటికి వెళ్లిన సందర్భాలే ఎక్కువ. ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్లం, పేగులు తెగే దాకా మన మాతృభూమి కోసం కొట్లాడిన వాళ్లం. మనకు సత్తువ.. సత్తా ఉంది. ప్రతిపక్ష హోదాలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం’అని పిలుపునిచ్చారు. 

సంప్రదాయ రాజకీయ పద్ధతులకు దూరం వల్లనే నష్టం 
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధి చేసినా సంప్రదాయ రాజకీయ పద్ధతులకు దూరంగా ఉండటం వల్లే నష్టం చేసిందనే భావన కార్యకర్తల్లో ఉందని హరీశ్‌రావు అన్నారు. ‘విభజన సమస్యల పరిష్కారంతో పాటు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం చేతులెత్తేసింది. కేంద్రంపై పోరు చేయాల్సిన కాంగ్రెస్‌ ఢిల్లీలో బీజేపీ నాయకులకు దండలు వేస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొనుగోలు చేస్తారని బండి సంజయ్‌ అనే బ్రహ్హజ్ఞాని చెప్తున్నాడు. పారీ్టలను కూల్చడం, చీల్చడం వంటివి కాంగ్రెస్, బీజేపీలకే అలవాటు.  

కాంగ్రెస్, బీజేపీ మైత్రిని ఒప్పుకుంటూ వార్తల్లో ఉండేందుకు బండి సంజయ్‌ తాపత్రయ పడుతున్నారు’’అని హరీశ్‌ ధ్వజమెత్తారు. హత్యారాజకీయాలు చేస్తోన్న కాంగ్రెస్‌  ’’రాష్ట్ర ఆర్దిక స్థితిగతులపై శ్వేతపత్రం ప్రకటించి బీఆర్‌ఎస్‌ను బదనాం చేసేందుకు ప్రయతి్నంచే క్రమంలో కాంగ్రెస్‌ తమ గోతిని తామే తీసుకుంది. తెలంగాణ ఆరి్ధక పురోగతిని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక కూడా పొగిడింది.

దేశంలో పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. దావోస్‌ వెళ్లడం దండగ అంటూ గతంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది పెట్టుబడులు వద్దని కాంగ్రెస్‌ చెప్తుందా? అని హరీశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement