విశ్వనగరమా? విద్వేష నగరమా? 

GHMC ELECTIONS : KTR  Speech At  Builders Federation‌ Meeting - Sakshi

హిందూ–ముస్లిం అనడం తప్పిస్తే బీజేపీకి ఏమీ రాదు

 గత ఆరేళ్లలో అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదు

బిల్డర్ల ఫెడరేషన్‌ సమావేశంలో కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరం కావాలా? విద్వేష నగరం కావాలా? అన్న అంశంపై ఆలోచన చేయాలని హైదరాబాద్‌ నగర ప్రజలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు మరోసారి విజ్ఞప్తి చేశారు. తెల్లారి లేస్తే అనుమానాలతో ఒకరినొకరు చూసుకొనే హైదరాబాద్‌ నగరం కావాలా? అన్నదమ్ముల్లా కలసి ఉండే హైదరాబాద్‌ కావాలా? అని ప్రశ్నించారు. మతం పేరుతో ఆగమాగం కావడానికి ఇది అహ్మదాబాద్‌ కాదని, ప్రగతిశీల ఆలోచనలుగల హైదరాబాద్‌ నగరమన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తాను చదువుకొనే రోజుల్లో ఏటా నగరంలో అల్లర్లు చోటుచేసుకొని వారం, పది రోజులు కర్ఫ్యూ ఉండేదన్నారు. గత ఆరేళ్లలో అరగంట కూడా నగరంలో కర్ఫ్యూ విధించలేదన్నారు. హిందూ–ముస్లిం అనడం తప్ప బీజేపీ నేతలకు మరేదీ తెలియదన్నారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్‌ అని ఎద్దేవ చేశారు. గత ఆరేళ్లుగా నగరంలో మత కల్లోలాలు, బాంబు పేలుళ్లు, ఆకాతాయిల ఆగాడాలు, చైన్‌ స్నాచింగ్‌లు, పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బు లేదన్నారు. నగరంలో 5 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే నిమి షాల్లో నిందితులను పట్టుకుంటున్నామన్నారు. చిన్న బిల్డర్ల సమస్యలను పరిష్కారిస్తామని, డిసెంబర్‌ 4 తర్వాత వారితో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 

హైదరాబాద్‌ దేశంలో భాగం కాదా? 
కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తితే వారం రోజుల్లోనే రూ. 640 కోట్లను కేంద్రం ఇచి్చందని, గుజరాత్‌లో వరదలు రాగానే రూ. 500 కోట్లను ప్రధాని మోదీ ఇచ్చారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. కానీ హైదరాబాద్‌లో వరదలొస్తే ఇప్పటివరకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని, భాగ్యనగరం భారతదేశంలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. గత ఆరేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్ల పన్నుల ఆదాయం వెళ్లిందని, మరోవైపు కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 1.40లక్షల కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయన్నారు. తెలంగాణకే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాజధాని అమరావతికి ప్రధాని మోదీ ఏం ఇచ్చారు? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తరఫున అమరావతి నిర్మాణానికి రూ. 100 కోట్ల విరాళాన్ని ప్రకటించడానికి సీఎం కేసీఆర్‌... రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారని కేటీఆర్‌ గుర్తుచేశారు. అయితే ప్రధాని కేవలం తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చారని తెలుసుకొని సీఎం కేసీఆర్‌ ఆ సహాయాన్ని ప్రకటించలేకపోయారన్నారు. 

బీజేపీపాలిత రాష్ట్రాల్లో గుంతల్లేని రోడ్లున్నాయా? 
హైదరాబాద్‌లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష ఇస్తానని ఓ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొనడాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా గుంతల్లేని రోడ్లను చూపిస్తే తానే రూ. 10 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. నీరు–తారు శత్రువులని, వర్షాలకు రోడ్లపై గుంతలు పడటం సహజం అన్నారు. ఆరేళ్లలో రూ. 67 వేల కోట్లతో నగరాభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థపై సమ్మెటపోటు పడిందని, కరోనా రాక ముందే జీడీపీ పతనమై ఆర్థిక సంక్షోభం తలెత్తిందని కేటీఆర్‌ పేర్కొన్నా రు. లాక్‌డౌన్‌ తర్వాత జీడీపీ ఏకంగా 31 శాతం పతనమైందన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎక్కడ ఉన్నాయని బీజేపీ వాళ్లు అడుగుతున్నారని, రూ. 18 వేల కోట్లతో 111 చోట్ల లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, వెళ్లి చూసుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథలో అవినీతి జరిగిం దని బీజేపీ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఈ పథకం ద్వారా 91.3 శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వమే హడ్కో అవార్డు ఇచ్చిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. రూ. 20 లక్షల కోట్లతో కేంద్రం ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ ఒక మాయ అని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ చార్జిïÙట్‌ విడుదల చేసిందని... మరి ఇప్పటివరకు వివిధ విషయాల్లో విఫలమైనందుకు బీజేపీపై ఎఫ్‌ఐఆర్‌లు వేయాలా? అని కేటీఆర్‌ నిలదీశారు. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి అవగాహన లేదని, ఆ పార్టీని పాతబస్తీలో ఓడిస్తామన్నారు. కాగా, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ తరఫున జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్‌రావు, నరసింహారావు తెలిపారు.      
   
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top