రాజీనామాపై జీవన్‌రెడ్డి క్లారిటీ.. చేరేది ఆ పార్టీలోకే..! | Former Minister Jeevan Reddy Clarifies On Resignation | Sakshi
Sakshi News home page

రాజీనామాపై జీవన్‌రెడ్డి క్లారిటీ.. చేరేది ఆ పార్టీలోకే..!

Mar 22 2026 4:21 PM | Updated on Mar 22 2026 4:57 PM

Former Minister Jeevan Reddy Clarifies On Resignation

సాక్షి, జగిత్యాల జిల్లా: రాజీనామాపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని.. ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో రాజీనామాను ప్రకటించిన జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు. పార్టీని వీడడానికి గల కారణాలపై కూడా జీవన్‌రెడ్డి లేఖ విడుదల చేశారు.

కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న జీవన్‌రెడ్డి.. 40 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా తనతో పాటు ప్రయాణం చేస్తున్న తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 25న సమావేశంలో చర్చించేందుకు కలుద్దామన్న జీవన్‌రెడ్డి.. గత 20 మాసాలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు మీరంతా గమనించారన్నారు.

ఇదిలా ఉండగా, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ బుజ్జగింపులు ఫలించలేదు. శనివారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈనెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి నుంచి మొదట నుంచి బలమైన సంకేతాలు ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడగా, రెండురోజుల క్రితం పీసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాజాగా మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు రంగంలోకి దిగారు. ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అయినా కూడా జీవన్‌రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement