ఎన్నికల ముందు ‘చేప కూర’ ఫైట్‌.. ఇప్పుడు రూ.5కే ఫిష్‌ రైస్‌ పథకం | Fish rice meals at rs 5 CM Suvendu Adhikari announces new initiatives | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు ‘చేప కూర’ ఫైట్‌.. ఇప్పుడు రూ.5కే ఫిష్‌ రైస్‌ పథకం

May 26 2026 4:56 PM | Updated on May 26 2026 5:51 PM

Fish rice meals at rs 5 CM Suvendu Adhikari announces new initiatives

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలను చేపలు తిననివ్వకుండా చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ముందు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మమత బెంగాల్ ఆహార సంస్కృతిపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. 

“బెంగాల్ ప్రజలు చేప-అన్నంతో జీవిస్తారు. బీజేపీ వాళ్లు బెంగాల్ ప్రజలను చేపలు తినొద్దు, మాంసం తినొద్దు, గుడ్లు తినొద్దు అంటున్నారు. మరి వాళ్లు ఏమి తింటారు?” అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయితే, అధికారంలోకి వచ్చినా అలాంటి చర్యలు తీసుకోబోమని బీజేపీ అప్పట్లోనే హామీ ఇచ్చింది. అనురాగ్ ఠాకూర్ సహా పలువురు బీజేపీ నేతలు బహిరంగంగా మాఛ్-భాత్ విందుల్లో పాల్గొన్నారు. బెంగాలీ సంస్కృతిపై తమకు అనుబంధం ఉందని చూపించే ప్రయత్నంలో నామినేషన్ ర్యాలీల్లో చేపలు చేతబట్టి కనిపించారు. ఇప్పుడు బీజేపీ చెప్పింది చెప్పినట్లు చేస్తోంది. 

ఇప్పుడు సీఎం ఏం చేశారు? 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. వాటిల్లో తక్కువ ధరలో చేప కూరతో భోజనం అందించే పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5కే ఫిష్‌ రైస్‌ మీల్స్‌ అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

అలాగే, అన్నపూర్ణ యోజన, మద్యం దుకాణాలపై నిబంధనలు, ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఆయన ప్రకటించారు. సువేందు అధికారి మాట్లాడుతూ.. మే 27 నుంచి అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.3,000 అందిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు.

“అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాలు రాష్ట్ర సచివాలయం నుంచి అందిస్తాం. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు భారతీయులందరికీ అర్హత ఉంటుంది” అని కల్యాణి, నాడియా జిల్లాలో జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో చెప్పారు. ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి ఉంటుందన్న విషయం తెలిసిందే.

మే 9న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సువేందు అధికారి వరుసగా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తూ రాష్ట్రానికి సంబంధించి కీలక  నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది.

Advertisement
 
Advertisement
Advertisement