కత్తులు దూసుకుంటున్న టీడీపీ నేతలు | Dispute Between Srikakulam TDP Leaders | Sakshi
Sakshi News home page

కత్తులు దూసుకుంటున్న టీడీపీ నేతలు

Jan 19 2021 11:18 AM | Updated on Jan 19 2021 7:25 PM

Dispute Between Srikakulam TDP Leaders - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల టీడీపీ నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. నువ్వెంత నేనెంత అన్నట్టుగా టీడీపీ వర్గాలు ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గ టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు నియోజకవర్గంలో కళా వైరి వర్గాలు కూడా ఏకమవుతున్నాయి. ఆయనకు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకటరావు ప్రస్తుతం బలహీనమైన శక్తిగా మిగిలిపోయే పరిస్థితి కనబడుతోంది.

కిమిడి కళా వెంకటరావు తన కుమారుడిని ప్రమోట్‌ చేసుకోవడం మొదలు పెట్టిన దగ్గరి నుంచి టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. కళాయే పక్క నియోజకవర్గ నేత. ఆయన్ని భరించడమే కష్టంగా ఉంది. ఆపైన ఆయన కుమారుడ్ని కూడా తమపై రుద్దడమేంటని ఎచ్చెర్ల టీడీపీ నేతలు ఆవేదనతో ఉన్నాయి. ఎన్నాళ్లీ రాజకీయాలు అని గగ్గోలు పెడుతున్నారు. కళా వెంకటరావు కుమారుడు రామ్‌ మల్లిక్‌ నాయుడికి రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను పరోక్షంగా అప్పగించడాన్ని నియోజకవర్గ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నాళ్లీ పల్లకీ మోత అని కళా నాయకత్వాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. రామ్‌ మల్లిక్‌ నాయుడినైతే కనీసం పట్టించుకోవడం లేదు. కొత్త నియామకాలు జరిగిన దగ్గరి నుంచైతే కళా వెంకటరావుకు ఒక్కొక్కరు దూరమవుతున్నారు.

ఆయన చేపట్టే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు సరికదా పోటీగా కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి ఆయన వ్యతిరేక వర్గీయులు ఎదిగారు. తాజాగా ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలను కూడా వేరుగా నిర్వహించారు. కళా వెంకటరావు నిర్వహించే కార్యక్రమానికి టీడీపీ నేతలు పెద్దగా హాజరు కాలేదు. రక్తదాన శిబిరానికి కూడా ఆశించినంత స్పందన రాలేదు. ఆయనకు పోటీగా స్థానిక నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు నిర్వహించే కార్యక్రమానికి మాత్రం ఎక్కువమంది హాజరయ్యారు. మొన్నటి వరకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా చేసిన చౌదరి ధనలక్ష్మి ఇతరత్రా నేతలు కలిశెట్టి అప్పలనాయుడు నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వగా, కళా వెంకటరావు నిర్వహించే కార్యక్రమానికి చోటామోటా నేతలు పాల్గొని మమ అనిపించారు. కొందరైతే ఇరువురు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గోడ మీద పిల్లిలా వ్యవహరించారు. మొత్తానికి ఎన్టీఆర్‌ వర్ధంతి వేదికగా జరిగిన కార్యక్రమంతో కళాకు ఉన్న పట్టు, వ్యతిరేకత ఏంటో స్పష్టంగా తెలిసింది.
  
ఇంటి పోరు.. 
మరోవైపు కళా వెంకటరావు ఇంటి పోరు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన సోదరుడు రామకృష్ణనాయుడు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేయడం కళాకు మైనస్‌గా మారింది. అధికారంలో ఉన్నంతసేపు నియోజకవర్గంలో చక్రం తిప్పిన రామకృష్ణంనాయుడు, ఆయన కుమారుడు ఇప్పుడు బీజేపీ నేతలతో చెట్టాపట్టాలేసి తిరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటిలోనే అన్న, ఇతర కుటుంబ సభ్యులే తాను పోలిట్‌ బ్యూరోగా ఉన్న పార్టీని కాదని బీజేపీ వైపు చూపులు చూడటంతో కళా పరిస్థితి దయనీయంగా తయారైంది. చివరికి కళా వెంకటరావు కూడా బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం సాగింది. ముందు కుటుంబ సభ్యులను పంపించి, తర్వాత ఆయన కూడా బీజేపీలోకి పయనమవుతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రచారం పీక్‌కు వెళ్లడంతో బీజేపీలోకి వెళ్లడం లేదని చివరికి కళా వెంకటరావే నేరుగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి కళా వెంకటరావు కుటుంబ రాజకీయం, ఇతర కారణాలతో ఆయన్ని ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలు పెద్దగా నమ్మడం లేదు. చౌదరి బాబ్జీ, జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన పలువురు నేతలు కళాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుండటంతో నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు చేజారిపోయేలా కనబడుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement