
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిన అవినీతి, కుంభకోణాలపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యుడు, ఏఐసీసీ మీడియా ప్రచార విభాగం చైర్మన్ పవన్‌ఖేరా సవాల్ చేశారు. శనివారం సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హోటల్ తాజ్‌దక్కన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందంటే, మారుమూల ప్రాంతాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైందని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు కూడా ప్రారంభమైందని గుర్తుచేశారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ సమర్థతపై మాట్లాడే సీఎం కుమార్తె కవిత ముందు తాను గత ఎన్నికల్లో ఓడిపోయిన అంశంపై ఆలోచించాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేయని వాగ్దానాలపై దృష్టి సారించాలన్నారు. గౌతమ్ అదానీ గురించి ఎందుకు నోరు విప్పరని, తాము బీఆర్‌ఎస్ కుంభకోణాలు బయటపెడితే కనీసం మీడియా ముందు మొహం చూపించలేరని దుయ్యబట్టారు.
మనోభావాలు దెబ్బతింటున్నాయి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వతీరుతో భారతసైన్యం మనోభావాలు దెబ్బతింటున్నాయని పవన్‌ఖేరా ఆందోళన వ్యకం చేశారు. ఒకవైపు చైనా భూభాగంలో మన సైన్యం ప్రాణాలు అర్పిస్తుంటే, ప్రధాని వేడుకల్లో మునగడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ కనీసం ట్వీట్ ద్వారా కూడా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనాకు క్లీన్‌చిట్ ఇవ్వడం సైనికుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది
రాహుల్ జోడోయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. భారత్ జోడోయాత్రతో ప్రజాసమస్యలపై చర్చ ప్రారంభమై కేంద్రంలోని బీజేపీ గందరగోళంలో పడిందని చెప్పారు. జోడోయాత్రతో భారత్ ఐక్యమవుతోంది..‘ఇండియా’ గెలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని, సీడబ్ల్యూసీ సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.