
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందంటూ ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేసిన రామచంద్రనాయక్.. ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడమే ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
‘పార్టీ ప్లీనరీ సమయంలో హరీష్ రావు కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు అంత సీను లేదని చెప్పారు. రెండు గంటలకు పైగా హరీష్ రావుతో చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లలేదు.హరీష్ రావు ఇంట్లో గతంలో పంక్షన్ జరిగినా కేటీఆర్, ఆయన కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు సడన్‌గా హరీష్ రావు పైన కేటీఆర్‌కు ఎందుకంత ప్రేమ వచ్చిందో చెప్పాలి.
హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత ఇప్పటికే పార్టీ కి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు. తన మీద దుష్పచారం జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని కవిత అంటోంది. మొత్తంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. హరీష్ రావు తో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
హరీష్‌రావు నివాసానికి కేటీఆర్
హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌తో భేటీ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన హరీష్ రావు తండ్రి ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కోకాపేట హరీష్‌రావు నివాసంలో సమావేశమైన ఇరువురు నేతలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్‌కు బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీ లైన్ దాటనని ఇటీవల హరీష్‌రావు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీష్‌రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన కానీ.. పని చేస్తానని హరీష్‌రావు తెలిపారు. వరంగల్ సభ తర్వాత పార్టీలో హరీష్‌రావు ప్రాముఖ్యత తగ్గిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మండిపడుతోంది. దీంతో నేరుగా హరీష్ రావుతో మాట్లాడి సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం.