
వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేయనుందని మూడు పార్టీల అంచనా
గెలుపుపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ధీమా...
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయి.
కాంగ్రెస్: విజయం కోసం ప్రణాళికలు
అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్‌లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని భావిస్తోంది. అధికారంలో ఉన్నా గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్‌లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని ప్రణాళికలు చేపడుతుంది.
బీఆర్‌ఎస్: పట్టు నిలుపుకునే యత్నం
బీఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్‌లో అన్నివర్గాలు తమవైపే ఉన్నాయని చూపించింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న ఉపఎన్నికల్లో మాగంటి సతీమణి సునీతకు సీటు కేటాయించి సెంటిమెంట్‌తో పాటు ఇక్కడ ఉన్న బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి బలంతో మరోసారి పాగా వేయాలని చూస్తోంది. కేటీఆర్, హరీష్‌రావులు తప్పక విజయం సాధించాలనే తపనతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తొంది. గ్రేటర్ పీఠాన్ని కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలి మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని చూస్తుంది.
బీజేపీ: వ్యూహం మారింది..
లేటుగా అయినా లేటెస్ట్ అంటూ..బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్ ఇచి్చంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి 26 వేల ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటాయని, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయని, అనూహ్యంగా రేసులో ముందుండి గెలుస్తామని ధీమాగా ఉంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుకోకుండా గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ కూడా భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తమ వ్యూహాలను ఎవరికీ తెలియకుండా గుంభనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.