లీకేజీలో కేటీఆర్‌ పీఏ..

Congress leaders went to the Governor on 21st - Sakshi

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణ

సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ 

నేడు గాంధారిలో నిరుద్యోగ నిరసన దీక్ష 

21న గవర్నర్‌ వద్దకు కాంగ్రెస్‌ నేతలు  

సాక్షి, కామారెడ్డి: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షపత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతికి భాగస్వామ్యం ఉందని, ఆయన ద్వారా సిరిసిల్ల జిల్లా మల్యాల మండలానికి చెందిన వందమందికి వందకుపైగా మార్కులు వచ్చినట్టు తమకు సమాచారం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట కార్నర్‌ మీటింగ్, కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సీబీఐపై నమ్మకం లేకుంటే సిట్టింగ్‌ జడ్జి చేత ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లీకేజీలో మంత్రి కార్యాలయానికి సంబంధం ఉండటం వల్లే విచారణ జరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్టు చేస్తే, కేటీఆర్‌ మాత్రం ఇద్దరే దొంగలన్నట్టు చెప్పడంలో మతలబేంటని ప్రశ్నించారు.

ఆ ఇద్దరి గురించి కేటీఆర్, బండి సంజయ్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని, వీరి వ్యవహారం చూస్తుంటే నిరుద్యోగుల జీవితాలతో రెండు పార్టీలు కూడబలుక్కుని ఆడుకుంటున్నట్టుగా ఉందని ఆరోపించారు. ఐటీ మంత్రిగా తాను బాధ్యుడినెట్లా అవుతానని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, అలాంటప్పుడు ఏ హోదాలో దానిపై సమీక్ష చేశారో చెప్పాలన్నారు.  

లీకేజీల్లో రికార్డులు 
2015లో సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియామకాల్లో ప్రశ్నపత్రాలు లీకైనందున ఒక కుటుంబంలో భార్య, భర్తకు, ఏబీసీడీలు రాని 30 మందికి కొలువులు వచ్చాయని రేవంత్‌ అన్నారు. గుర్గావ్‌ ప్రెస్‌లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయంటూ 2016లో మెడిసిన్‌కు సంబంధించి ఎంసెట్‌ పరీక్ష రద్దు చేశారని, 2017లో సింగరేణిలో ఎలక్ట్రికల్, మెకానికల్‌ ఉద్యోగ పరీక్షపత్రాలు లీకయ్యాయన్నారు.

2022 లో సదరన్‌ డి్రస్టిబ్యూషన్‌ కంపెనీలో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు బయటపడ్డాయని, పోలీసు రిక్రూట్‌మెంట్‌ గందరగోళంగా తయారై వేలాదిమంది యువత ఇబ్బందులు పడ్డారన్నారు. పేపర్‌ లీకేజీపై ఈ నెల 21న కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలంతా గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు.  

నేడు నిరుద్యోగ నిరసన దీక్ష... 
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై విచారణ కోరుతూ ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్‌ దిష్టి»ొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇంతకాలం 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేశామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ పత్రాలు లీకేజీ కావడంతో 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తనకు తానే బయటపెట్టిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో చిన్నచేపలను బలి చేసి, చైర్మన్, బోర్డు మెంబర్లు, సీఎం కేసీఆర్, కేటీఆర్‌ తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top