ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొంతు రామ్మోహన్‌..!

CM KCR Meeting With TRS MLAs Ahead Of GHMC Elections - Sakshi

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో మినీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషనతో‌ పాటు పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు సిద్ధంగా ఉండగా.. గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టిసారించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రంగంలోకి దిగిన కేటీఆర్‌ గ్రేటర్‌ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో విడతల వారిగా సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డబుల్‌ బెడ్‌రూంల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం నిర్వహించారు. (అంతుపట్టని రహస్యం: కేసీఆర్‌‌ వ్యూహమేంటి?)

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థల ఎంపికలపై తీసుకువాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌‌ నగర్‌ స్థానం నుంచి మేయర్‌ బొంత రామ్మోహన్‌ను బరిలో నిలిపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో తీవ్ర పోటీ ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, ఉద్యోగుల్లో నిరాశ విపక్షాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీతో సత్సంబంధాలు, స్థానిక యువతలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న రామ్మోహన్‌ను బరిలో నిలిపితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేటి భేటీలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికపై కూడా సీఎం పార్టీ నేతలతో చర్చించనున్నారు. (‘మండలి’ స్థానంపై.. పార్టీల గురి!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top