Chandrababu Naidu Trying To Save Party Cadre in Kuppam Constituency - Sakshi
Sakshi News home page

కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ!

Published Sun, Oct 9 2022 8:10 AM

Chandrababu Naidu Trying to save Party cadre in Kuppam Constituency - Sakshi

కుప్పంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గతనెల 23న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అవుతోంది. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెగ్గొట్టి టీడీపీ కేడర్‌ మొత్తం వైఎస్సార్‌సీపీ వైపు చూస్తోంది. బాబుకు బైబై చెప్పి అధికారపారీ్టలో పొలోమని చేరిపోతోంది. విషయం పసిగట్టిన టీడీపీ అధిష్టానం పార్టీ కేడర్‌ను కాపాడుకునేపనిలో పడింది. అధినేత చంద్రబాబుతోపాటు తనయుడు చినబాబు రోజూ టెలీకాన్ఫరెన్స్‌ల్లో మాట్లాడి నేతలను బుజ్జగిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. అయినా కుప్పం ప్రజానీకం మార్పును కోరుకుంటుండడంతో వైఎస్సార్‌సీపీ సమరోత్సాహంతో ముందుకు సాగుతోంది. 

సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. పార్టీ అధినాయకత్వం నియోజకవర్గ నేతల తీరుతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. రోజూ పార్టీ నాయకులు, ఓటు బ్యాంకు ఉన్న కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ పరువు కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 23న కుప్పంలో మూడవ విడత వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయనకు అపూర్వ స్పందన లభించింది.

సీఎం వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా  జనం బ్రహ్మరథం పట్టారు. కుప్పంలో ముఖ్యమంత్రికి లభించిన ఆదరణ చూసి చంద్రబాబు అండ్‌ కో షాక్‌కి గురయ్యారు. అప్పటివరకు చంద్రబాబు, స్థానిక నేతల తీరుతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న టీడీపీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ మారాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా ద్వితీయ, తృతీయశ్రేణి నేతలతోపాటు కార్య కర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిపోతున్నారు. ఇటీవల గుడుపల్లె మండలానికి చెందిన 50 కుటుంబాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. 

టీడీపీలో కలవరం 
సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన తర్వాత టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఉత్సాహం చూపు తున్న విషయాన్ని పసిగట్టిన తమ్ముళ్లలో కలవరం మొదలైంది. గుడుపల్లె మండలానికి చెందిన వారి చేరికతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కుప్పంలో జెండా మోసేందుకు ఒక్కరూ మిగలరని భావించిన టీడీపీ నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటనే  చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు స్పష్టమవుతోంది. పార్టీలో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో వివరాలు సేకరించి.. అందులో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలను విభజించారు.

ముందుగా నియోజకవర్గ స్థాయి నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టి.. వారితో చంద్రబాబు ఓ సారి, లోకేష్‌ బాబు మరోసారి విడివిడిగా ఫోన్లలో మాట్లాడుతూ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి ఏకరువు పెడుతుండడంతో ఎవరిని తిట్టాలో, ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థంగాక చంద్రబాబు తలపట్టుకుంటున్నారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. నాయకులు, కార్యకర్తల అసంతృప్తికి దారితీసిన కారణాలపై ఎవరిని బాధ్యులను చేయాలో అర్థంగాక చంద్రబాబు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? ఎవరిని దగ్గరికి తీసుకోవాలనే దానిపై పార్టీ ముఖ్యనాయకులతో చర్చించినట్లు సమాచారం.

కులం పేరుతో రెచ్చగొడుతున్న బాబు 
ఆగస్టులో మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో టీడీపీ శ్రేణులు కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. రామకుప్పం మండలం కొల్లుపల్లి, కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా లు చించివేసి పార్టీ శ్రేణులపై రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు గాయాలపాలయ్యారు. టీడీపీ శ్రేణుల తీరుతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దాడులకు కారకులైన కొందరు టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసులు నమోదైన వారితో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘మీ కులం వారిపై వైఎస్సార్‌సీపీ వారు కావాలనే కేసు నమోదు చేశారు. మిమ్మల్ని మండలంలోనే ఉండకుండా చేయాలని చూస్తున్నారు. మీరంతా ఏకమవ్వాల్సిన సమయం దగ్గరపడింది. మీకు అండగా నేను ఉంటాను’. అంటూ కులాన్ని రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారన్న చర్చ మొదలైంది. చంద్రబాబు తీరుతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతుండడం గమనార్హం.  

అందుకే బాబును నమ్మడంలేదు 
ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోశాం. కష్టాలు పడ్డాం. అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ ఆయన (చంద్రబాబు) మాలాంటి వాళ్లను నమ్మలేదు. కొంతమంది మాటలే వింటూ.. అన్ని పదవులు వారికే కట్టబెట్టారు. ఇప్పుడు అధికారం లేదని చినబాబు, పెదబాబు బేరాలు ఆడుతున్నారు. రోజూ ఫోన్లు చేసి బుజ్జగిస్తూ.. అండగా ఉంటామని నూరిపోస్తున్నారు. కానీ మళ్లీమళ్లీ మోసపోకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాం. అందుకే ఆ పార్టీ (టీడీపీ) కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాం. పార్టీలకతీతంగా అందరి సంక్షేమం కోరుకుంటున్న వైఎస్సార్‌సీపీని ఈసారి గెలిపించాలనుకుంటున్నాం. 
 – మునస్వామినాయుడు (పేరు మార్చాం), టీడీపీ నాయకుడు, కుప్పం 

టీడీపీ నామ రూపాల్లేకుండా పోతోంది 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమందినే నమ్మారు. నిజమైన కార్యకర్తలను దూరంగా పెట్టారు.  అధికారమదంతో కన్నుమిన్నూ కానకుండా ప్రవర్తించారు. ఇప్పుడు అధికారం పోయిందని కల్లబొల్లిమాటలు చెబుతున్నారు. రోజూ మీటింగ్‌ల పేరుతో చావగొడుతున్నారు.  కానీ ఆయన మాటలు నమ్మేందుకు ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. 30 ఏళ్లుగా కష్టపడ్డ వాళ్లందరూ ఇప్పుడు ఫ్యాన్‌గాలికింద సేదతీరాలని భావిస్తున్నారు. ఈసారి కుప్పంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుంది.      
– గణేష్‌ (పేరు మార్చాం), టీడీపీ నాయకుడు, కుప్పం 

Advertisement
 
Advertisement