
పల్నాడు జిల్లా గుళ్లపాడులో దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడైన చంద్రయ్య పాడెమోస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి (ఫైల్)
సాక్షి, గుంటూరు: ఫ్యాక్షన్ మహమ్మారిని వదిలించుకొని, అభివృద్ధి పథంలో ఉన్న పల్నాడులో తెలుగుదేశం పార్టీ మళ్లీ చిచ్చు రగులుస్తోంది. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి, ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. చంద్రబాబు, ఆ పార్టీ నేతలు పథకం ప్రకారం శవ రాజకీయాలు చేస్తూ పల్నాడుపై విషం కక్కుతున్నారు.
వ్యక్తిగత కారణాలు, పాత కక్షలతో జరుగుతున్న హత్యలకు రాజకీయ రంగు పులిమి అధికార పార్టీకి అంటగడుతూ నీచ రాజకీయానికి దిగుతున్నారు. 2019లో లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ పల్నాడుపై విషం చిమ్ముతోంది.
శవం దొరికితే చాలు అన్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, నేతలు రచ్చచేసి రాజకీయం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం జంగమహేశ్వరపాడు గ్రామం పరిధిలో జరిగిన కంచర్ల జాలయ్య హత్యలోనూ అదే పంథాను అనుసరించారు.
హత్య కేసులో నిందితుడు జాలయ్య
దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన టీడీపీ నాయకుడు కంచర్ల జల్లయ్యపై 2014 – 2019 మధ్య పది కేసులు నమోదయ్యాయి. దాడులు, హత్యాయత్నం, ఘర్షణలు సృష్టించడం వంటి అనేక కేసుల్లో నిందితుడు. టీడీపీ అధికారంలో ఉన్న 2014లో వెంకట్రామయ్యను జంగమహేశ్వరంపాడులో ఇనుప రాడ్లతో దాడి చేసి చంపారు.
ఈ కేసులో జాలయ్య ఏ1 ముద్దాయి. పల్నాడులో ప్రశాంత వాతావరణం కోసం కృషి చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవలే ఇరువర్గాలను రాజీచేశారు. ఈ ఏడాది జనవరి 24న కేసు కొట్టేశారు. జాలయ్య ప్రవర్తన మార్చుకోకుండా నిత్యం ప్రత్యర్థులపై కాలు దువ్వుతుండేవాడని, ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు అతన్ని హత్య చేశారనే వాదన వినిపిస్తోంది.
2 వర్గాల మధ్య జరిగిన పోరుకు చంద్రబాబు రాజకీయ రంగు పులిమి అధికారపార్టీపై నెపం నెట్టడం విడ్డూరంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జాలయ్య మృతదేహంతో శవ రాజకీయం చేయాలని నరసరావుపేటలో టీడీపీ నేతలు కుట్ర పన్నారు. పోలీసులు దీన్ని అడ్డుకొని, మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులపురానికి తరలించడంతో టీడీపీ నేతలు నిరాశకు లోనయ్యారు.
చంద్రయ్య హత్యలోనూ అంతే
మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు, గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు ఈ ఏడాది జనవరి 13న హత్య చేశారు. చంద్రయ్యదీ నేర చరిత్రే. దోపిడీ, హత్య కేసులో జైలుకు వెళ్లాడు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఐదుసార్లు బైండోవర్ చేశారంటే అతని నేరచరిత్ర అర్థం చేసుకోవచ్చు.
బ్రహ్మారెడ్డి తిరిగి నియోజకవర్గంలోకి రావడంతో చంద్రయ్య దౌర్జాన్యాలకు హద్దు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో చంద్రయ్యను ప్రత్యర్థులు హత్య చేశారు. నేర చరితుడైన చంద్రయ్య అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు అతని పాడె మోసి రాజకీయం చేసి విమర్శల పాలయ్యారు.
జూలకంటి ఎంట్రీతో మొదలు
మూడేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో జూలకంటి బ్రహ్మారెడ్డికి పదవి ఇచ్చి చంద్రబాబు తిరిగి ఉద్రిక్తతలు నెలకొనేలా చేశారు. 2001 మార్చి 10న దుర్గి పోలీస్ స్టేషన్‌లో కండిషన్ బెయిల్‌పై సంతకాలు చేసేందుకు వెళ్తున్న సాంబిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డి, మరో ఐదుగురిని లారీతో ఢీకొట్టించి, కత్తులు, బాంబులతో దాడి చేయించి వెంటాడి మరీ బ్రహ్మారెడ్డి హత్య చేయించారు.
కొన్నేళ్ల పాటు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న బ్రహ్మారెడ్డిని చంద్రబాబు తిరిగి రప్పించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పింది. బ్రహ్మారెడ్డి తన పాత అనుచరులతో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. నిత్యం ఉద్రిక్తతలు సృష్టించేలా ఆయన వ్యవహారం ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. 13 ఏళ్లుగా ఒక్క ఫ్యాక్షన్ హత్యా జరగని మాచర్లలో ఐదారు నెలల కాలంలోనే రెండు హత్యలు ఎలా జరిగాయో ప్రజలకు అర్థమవుతుందని స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.
పల్నాడు అభివృద్ధికి అడ్డంకులు
చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడూ పల్నాడు అభివృద్ధి కోసం కృషి చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా పల్నాడు ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తోంది.
పల్నాడు ప్రత్యేక జిల్లా, వరికపూడిసెల ప్రాజెక్టు, మెడికల్ కళాశాల, జాతీయ, రాష్ట్ర రహదారులు, సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలను అందుకుంటున్న ప్రభుత్వంపై కక్ష కట్టి అసత్య ఆరోపణలకు చంద్రబాబు అండ్ టీం పనిచేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పల్నాడు అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్షానికి బుద్ధి చెబుతామంటున్నారు.