బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై

BS Yediyurappa Ready To Show Strength And Planing To Tour - Sakshi

పార్టీ తీరుపై అసహనం

తన కుమారుడు, వర్గానికి అప్రాధాన్యంపై గుస్స

త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనకు ప్రణాళిక

వచ్చే ఎన్నికలకు కుమారుడిని బలోపేతం చేసేందుకు కార్యాచరణ?

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత పరిస్థితులు చక్కబడతాయనుకుంటే ఏం మారలేదని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు తమ శాఖలపై అసహనంతో ఉన్నారు. అప్రాధాన్య శాఖలు ఇచ్చారని సీనియర్‌ నాయకులు అసంతృప్తిలో ఉండగా.. మరికొందరు సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పదవి నుంచి అకారణంగా పంపించి వేసిన వైనంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనతో బలవంతంగా రాజీనామా చేయించిన పార్టీ తీరుపై మండిపడుతున్నారు. వాటితోపాటు కొత్త ప్రభుత్వంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటకలో వార్తలు వస్తున్నాయి. 

పదవి నుంచి దిగిన అనంతరం కొన్నాళ్లు ఎవరితో మాట్లాడకుండా ఉన్న యడియూరప్ప వారం కిందట మాల్దీవులుకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే శివమొగ్గలో పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప యడియూరప్పను కలిశారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్రకు సహకరించనున్నట్లు సమాచారం. త్వరలోనే కుమారుడితో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడికి బలం చేకూర్చాలని యడ్డియూరప్ప లక్ష్యమని పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు)

అయితే సోమవారం పార్టీ కర్ణాటక ఇన్‌చార్జి అరుణ్‌సింగ్‌ మూడు రోజుల పర్యటనకు మైసూర్‌ చేరుకున్నారు. పార్టీలో ఇంకా సద్దుమణగని విబేధాలు, లుకలుకలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే యడియూరప్ప తన బలం చూపించాలని భావిస్తున్నారట. ఈ సందర్భంగా తన అనుచరులకు ఈ మేరకు ఆదేశాలు పంపారంట. త్వరలోనే తన మద్దతుదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నారని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. తనకు తన వర్గానికి అప్రాధాన్యం ఇవ్వడంపై యడియూరప్ప వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. త్వరలోనే యడియూరప్ప వర్గం పార్టీలోనే ఉంటూనే తమ బలం నిరూపించుకునే మార్గాలు అన్వేషిస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా జూలై 28న బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top