ముందు వంద రోజుల్లో హామీలు అమలు చెయ్యి! | Sakshi
Sakshi News home page

ముందు వంద రోజుల్లో హామీలు అమలు చెయ్యి!

Published Sun, Jan 21 2024 4:08 AM

BRS MLA KTR Counter To CM Revanth Reddy Comments: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి ముందు వంద రోజుల్లో హామీల అమలుపై దృష్టిపెట్టాలని, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడవచ్చని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు పేర్కొన్నారు. మఖలో పెట్టి పుబ్బలో కలసిపోయే పార్టీ అని టీఆర్‌ఎస్‌ గురించి చాలా మంది మాట్లాడారని, రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడిందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని వంద మీటర్ల లోపల బొందపెడతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్‌.. తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? మిమ్మల్ని, మీ దొంగ హామీలను ప్రశ్నిస్తునందుకా?’’ అని నిలదీశారు. ఇలా అహంకారంతో మాట్లాడే రేవంత్‌ వంటి నాయకులను టీఆర్‌ఎస్‌ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకర్గాల సమీక్ష సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఏక్‌నాథ్‌ షిండేలా మారుతారని, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతాయని పేర్కొన్నారు. రేవంత్‌ రక్తం అంతా బీజేపీదేనని, చోటా మోదీగా రేవంత్‌ మారారని విమర్శించారు. అదానీ గురించి గతంలో అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌.. ఇప్పుడు ఆయన వెంటపడుతున్నారని, వారి మధ్య ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్‌.. ఇప్పుడు ట్రిపుల్‌ ఇంజిన్‌గా మారారని ఆరోపించారు.

ఎవరూ కరెంటు బిల్లులు కట్టొద్దు
ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లులు కట్టవద్దని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం గృహజ్యోతిని అమల్లోకి తెచ్చేదాకా బిల్లులు కట్టొద్దన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ బిల్లులను సోనియాగాంధీ కడుతుందని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అధికారులు కరెంటు బిల్లులు అడిగితే రేవంత్‌ చెప్పిన మాటలను వినిపించాలన్నారు.

కరెంట్‌ బిల్లుల ప్రతులను సోనియాగాంధీ నివసించే 10 జన్‌పథ్‌కు పంపించాలన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారికి కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు రూ.2,500 ఆర్థికసాయం వెంటనే అమల్లోకి తేవాలన్నారు. ఇచ్చిన హామీలపై తప్పించుకోవాలని చూస్తే కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

బీజేపీతో పొత్తు మాటే లేదు
బీఆర్‌ఎస్‌కు బీజేపీతో ఏరోజూ పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండబోదని కేటీఆర్‌ చెప్పారు. ఐదేళ్లుగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కడితే.. కిషన్‌రెడ్డి సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్‌ను జాతికి అంకితం చేశారని, ఇదే ఆయన చేసిన అతిపెద్ద పని అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో 36 ఫ్లైఓవర్లు కడితే.. కేంద్ర ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్లు కట్టలేక చేతులెత్తేసిందని విమర్శించారు.

ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే..
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని.. ఓడినా గెలిచినా బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ప్రజాపక్షమేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్‌ పాలనలో ఆటోడ్రైవర్లు మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుబంధు అందడం లేదని, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2,500 ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారు హామీలు నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని.. కాంగ్రెస్‌వి ఆరు గ్యారంటీలు కావు, 420 గ్యారంటీలని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబా ద్‌లో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావు, మాగంటి గోపీనాథ్, వెంకటేశ్, నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, హైదరా బాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement