
అధ్వానంగా పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ
నిధులు లేక, పెండింగ్ బిల్లులు రాక తీవ్ర సంక్షోభంలో పంచాయతీలు
‘సాక్షి’ వరుస కథనాలను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: కంపుకొడుతున్న పల్లెలు, పట్టణాలే ఇందిరమ్మ పాలనకు ఆనవాళ్లా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెల్లో పాలన పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సాక్షి’లో ఈనెల 12న ప్రచురితమైన ‘పెను సంక్షోభంలో పట్టుగొమ్మలు’, 13న ప్రచురితమైన ‘పూర్.. పాలికలు!’ కథనాల క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేశారు.
పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణను కూడా పట్టించుకోకపోవటంతో పల్లెల్లో ప్రజాజీవనం దినదిన గండంలా మారిందని చెప్పారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగీ, మలేరియాలాంటి విషజ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. పంచాయతీలకు నిధులు చెల్లించకపోవటంతోనే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీల నిర్వహణ తీవ్ర సంక్షోభంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్‌లకు పాత పనులకు సంబంధించి ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించటం లేదన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రతినెలా పంచాయతీలకు ఠంచన్‌గా రూ.275 కోట్లు విడుదల చేశామని, కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1,800 మంది మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులు గ్రామపంచాయతీలకు ఎప్పుడిస్తారని నిలదీశారు.
ఉపాధిహామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4,305 కోట్లు అని, వాటి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో రూ.1,200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే...ఇక ఇతర శాఖల పరిస్థితి ఏమిటన్నారు. ఆగస్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి లేదని చెప్పారు. కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను గట్టెక్కించేందుకు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని సూచించారు.
రూ.50 వేల కోట్ల అప్పులు చేయడమే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పా?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు తీసుకురావడమే వారు తెచ్చిన మార్పా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా అంత అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఒక ప్రకటనలో ధ్వజ మెత్తారు. 2023 నాటికి రాష్ట్రం రూ.5,900 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉంటే.. 8 నెలల కాలంలో దానిని రూ.50 కోట్ల అప్పుగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను పెంచిన బీఆర్‌ఎస్‌పై అప్పులు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు.
అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని, ఇప్పుడు అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్‌లో నిలుస్తుందని చెప్పారు. ఇదేవిధంగా అప్పులు చేసు కుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి రూ.4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల అప్పులభారం రాష్ట్రంపై పడడం ఖాయమని చెప్పారు. అప్పుల విషయంలో బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయ టంలో కాంగ్రెస్ విజయవంతమైందన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతారని తెలిపారు.