
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి
పార్టీ నేతలు, కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతూ సన్నద్ధులను చేసేలా ప్రణాళికలు
అభ్యర్థుల ఎంపిక, సమన్వయం, ప్రచార షెడ్యూల్‌పై కసరత్తు
ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను చేర్చుకోవడం ద్వారా కొత్త ఎత్తుగడ!
కాంగ్రెస్, బీజేపీల అడుగులపై నజర్
నేతలు పార్టీని వీడిన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు
ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచారానికి సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంటా బయటా ఎదురవుతున్న వరుస సవాళ్లను అధిగమిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా పార్టీని నడిపించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నేతల నిష్క్రమణ, ఎమ్మెల్సీ కవిత అరెస్టు వంటి పరిణామాలు పార్టీలో కలకలం రేపుతున్నప్పటికీ.. కీలకమైన అభ్యర్థుల ఎంపిక, సమన్వయం, ప్రచార షెడ్యూల్ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. పార్టీ నేతలు, కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతూ ఎన్నికలకు సన్నద్ధులను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
బీఎస్‌పీతో పొత్తు వ్యూహం విఫలమైనా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. మరో అరడజను లోకసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి భారీ బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఎన్నికల ప్రచార పర్వంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
త్వరలోనే మిగతా అభ్యర్థుల ప్రకటన
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. 9 మంది బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు పార్టీని వీడిన నేపథ్యంలో..మిగిలిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలతో పాటు కొత్తగా 8 మంది పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక పార్టీలో తాజాగా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. దీంతో పాటు కీలకంగా భావిస్తున్న సికింద్రాబాద్, భువనగిరి, నల్లగొండ, మెదక్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. మెదక్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే సికింద్రాబాద్, భువనగిరి అభ్యర్థులు ఎవరనే అంశంపై పార్టీ లోపలా బయటా సస్పెన్స్ కొనసాగుతోంది.
సీనియర్లకు సమన్వయ బాధ్యతలు
తొలుత అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల సన్నద్ధత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23న చేవెళ్లలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను రద్దు చేసి, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా భేటీలు జరపాలని ఆదేశించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంపూర్ణ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యకు అప్పగించారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేడర్‌ను సమన్వయం చేయాల్సిందిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆదేశించారు.
ఆశావహులకు బుజ్జగింపులు
లోక్‌సభ టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే బాధ్యతను స్థానిక నేతలకు కేసీఆర్ అప్పగించారు. ఈ నేపథ్యంలో వరంగల్ టికెట్ ఆశించిన డాక్టర్ నిరంజన్, జోరిక రమేశ్, యాదగిరి, బోడ అనయ్ తదితరులను మంగళవారం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు బుజ్జగించారు. త్వరలో కేసీఆర్ లేదా కేటీఆర్ వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇదే తరహాలో మహబూబాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది.
ఎప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలుజాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న ఎన్నికల ఎత్తుగడలు, అనుసరిస్తున్న వ్యూహా లను కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. కొందరు పార్టీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను చేర్చుకుంటూ బీఆర్‌ఎస్‌ను బలహీన పరిచేందుకు ఆ రెండు పార్టీలూ చేస్తున్న ప్రయత్నాలపై దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు.
సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా కేడర్‌లో అయోమయానికి తెరదించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్ (వర్ధన్న పేట), సైదిరెడ్డి (హుజూర్‌నగర్), ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకటరావు (భద్రాచలం) తదితరులు పార్టీని వీడిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సంబంధిత జిల్లా నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. స్థానిక కేడర్‌తో బుధవారం నియోజక వర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.