సిట్టింగ్‌లు కొందరే! | BRS Focus On Lok Sabha elections | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌లు కొందరే!

Feb 26 2024 4:58 AM | Updated on Feb 26 2024 4:58 AM

BRS Focus On Lok Sabha elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్న వేళ..భారత్‌ రాష్ట్ర సమితి ఆచితూచి అడుగులు వేస్తోంది. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, పక్కా వ్యూహంతో వైరిపక్షాలను దెబ్బకొట్టాలని, మెజారిటీ సీట్లు సాధించాలని అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. 2019లో తొమ్మిది సీట్లలో పార్టీ విజయం సాధించగా, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు.

మిగతా ఏడుగురు సిట్టింగ్‌ సభ్యుల్లో ముగ్గురు లేదా నలుగురికే తిరిగి అవకాశం ఇచ్చి, మిగతా చోట్ల వేరే వారికి చాన్స్‌ ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆర్థిక స్తోమత కలిగి, ఆయా నియోజకవర్గాల్లో మంచి పేరున్న వారై ఉండాలని పార్టీ భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే మొదటి విడత కసరత్తు పూర్తి చేసిన పార్టీ అధినాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వ్యూహ రచన చేస్తోంది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికల తరహాలో ముందస్తుగా పార్టీ అభ్యర్థులనుప్రకటించకూడదని పార్టీ నిర్ణయించింది. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన తరువాత సమీకరణాలను బేరీజు వేసుకొని ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తోంది.  

ఇప్పటికే సన్నాహక సమావేశాలతో..
శాసనసభ ఎన్నికల తరువాత ఓటమి షాక్‌లో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహ పరచడంతో పాటు పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసే ప్రక్రియను నెల క్రితమే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో ఒక్కోరోజు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశాల్లో శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో కలిసి సమాలోచనలు చేశారు. ముఖ్య నాయకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా అధినేత కేసీఆర్‌కు నివేదికలు అందజేశారు. తర్వాత కేటీఆర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముఖ్య నేతలతో సమావేశమతున్నారు. ఈ సమావేశాల తరువాత అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

సన్నాహక సమావేశాల్లోనే ఇద్దరికి గ్రీన్‌సిగ్నల్‌..
ఖమ్మం, చేవెళ్ల లోక్‌సభ సీట్లను సిట్టింగ్‌ ఎంపీలకే కేటాయిస్తున్నట్లు సన్నాహక సమావేశాల్లో కేటీఆర్‌ ప్రకటించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావును, చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని పార్టీ యంత్రాంగాన్ని కోరారు. కాగా జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు స్థానికంగా పని చేసుకోవాలని సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

వీరితో పాటు కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను తిరిగి గెలిపించుకోవాలని ఆ నియోజకవర్గ సమావేశంలోనే కాకుండా కరీంనగర్, సిరిసిల్ల పర్యటనల్లో కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మిగతా స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా సిట్టింగ్‌ ఎంపీల సీట్లను అడుగుతున్నారు. అదే సమయంలో 2019లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిచిన ఏడు స్థానాల కోసం కూడా పలువురు పోటీ పడుతుండడం గమనార్హం. 

రేసులో ముఖ్య నేతలు
పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీగా పోటీ చేసి గెలిచిన వెంకటేశ్‌ నేత, మరోమారు తనకు సీటు దక్కే పరిస్థితి లేదని అర్ధమయ్యే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, కొప్పుల ఈశ్వర్‌నే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. మెదక్‌ నుంచి గెలిచిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి చాలా మందే లైన్‌లో ఉన్నా వంటేరు ప్రతాప్‌రెడ్డి వైపు కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ, మారిన పరిస్థితుల్లో వంటేరు వైపే కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నారని సమాచారం. పసునూరి దయాకర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్‌ స్థానం కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడి ఆశావహుల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

మహబూబాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీగా మాలోతు కవిత ప్రాతినిథ్యం వహిస్తుండగా సీతారాం నాయక్, రెడ్యా నాయక్‌ల వైపు పార్టీ చూస్తున్నట్టు సమాచారం. మహబూబ్‌నగర్‌కు మన్నె శ్రీనివాస్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీగా ఉన్న పి.రాములు వైపే ఈసారి కూడా పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాములు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ పార్టీలో నాగర్‌కర్నూల్‌ సీటుకు పోటీ ఎక్కువగా ఉండటం గమనార్హం. 

ఆ స్థానాలపై ప్రత్యేక దృష్టి
ఎంఐఎం గెలిచిన హైదరాబాద్‌ మినహా గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ గెలుచుకున్న ఏడు సీట్లపై కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, బీఆర్‌ఎస్‌ పట్ల సానుభూతిని అనుకూలంగా మలుచుకొని ఆయా సీట్లలో కూడా గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ భావిస్తోంది. కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ఖరారు కాగా, ఆదిలాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలోకి దింపే యోచనలో ఉంది.

నిజామాబాద్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేయడం లేదని ఇప్పటికే స్పష్టమైంది. దీంతో ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్న అరవింద్‌కు పోటీగా మున్నూరు కాపు వర్గానికే చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలోకి దింపే యోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిత్వానికి కూడా గట్టి పోటీ ఉన్నప్పటికీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఈ పార్లమెంటు స్థానంలో కూడా కేవలం గోషామహల్‌ మినహా అన్నిచోట్లా బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హవా చూపించినప్పటికీ, ఈసారి తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి లేదా తేరా చిన్నపరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ల పేర్లు పరిశీలిస్తున్నారు. గుత్తా అమిత్‌రెడ్డికి నల్లగొండ లేదా భువనగిరిలలో ఏదో ఒకచోట నుంచి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు. 

రేసులో ముఖ్యనేతలు
పెద్దపల్లి ఎస్సీ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంకటేశ్‌ నేత మళ్లీ సీటు దక్కే పరిస్థితి లేదని అర్ధమయ్యే పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేరూ వినిపిస్తున్న ప్పటికీ, కొప్పుల ఈశ్వర్‌నే బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. మెదక్‌ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి వైపు కేసీఆర్‌ మొగ్గుచూపుతున్నట్లు సమా చారం. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ, మారిన పరిస్థితుల్లో వంటేరుకే సీటిచ్చేందుకు కేసీఆర్‌ మొగ్గుచూపుతు న్నారని సమాచారం.

పసునూరు దయాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ స్థానంలో పోటీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ప్రయత్నిస్తున్నారు. మహబూ బాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీగా మాలోతు కవిత ప్రాతినిధ్యం వహిస్తుండగా సీతారాం నాయక్, రెడ్యా నాయక్‌ల వైపు పార్టీ చూస్తున్నట్టు సమాచారం. మహబూబ్‌నగర్‌పై మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీగా ఉన్న రాములుకే ఈసారీ పార్టీ మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. రాములు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ పార్టీలో నాగర్‌కర్నూల్‌ సీటుకు పోటీ ఎక్కువగా ఉండటం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement