Huzurabad: ఓట్ల కోసం కుట్రలు చేయడం సిగ్గుచేటు

BJP Leader NVSS Prabhakar Comments On TRS Party In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మంత్రులు తమ నియోజకవర్గాల్లో అమలు చేయించుకునే దమ్ము, ధైర్యం ఉంటే స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు తమ నియోజకవర్గాలు, మంత్రిత్వశాఖలను గాలికి వదిలి హుజూరాబాద్‌ రాజకీయం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఓటర్లను మభ్యపెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ నియోజకవర్గాల్లోని దళితులకు మూడెకరాల భూమి, అర్హులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఎస్సీసబ్‌ ప్లాన్‌ నిధులతో ఎంతమందిని ఆదుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఈటల రాజేందర్‌ను ఓడించడానికి టీఆర్‌ఎస్‌ యంత్రాంగం, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నా నేటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత రాజకీయాలకు అలవాటు పడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు.

మజ్లిస్‌ చేతిలో కీలుబొమ్మగా మారిందని, నాటి నిజాం సర్కారుకు నేటి కేసీఆర్‌ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, మీడియా ఇన్‌చార్జి కటకం లోకేశ్, ఉమామహేశ్వర్‌ పాల్గొన్నారు.  

చదవండి: ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top