సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్‌రెడ్డి

Published Thu, May 23 2024 5:18 AM

BJP Leader Kishan Reddy Comments On Sonia Gandhi

1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకా ? 

సోనియాను దెయ్యం అన్న రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ఆమె దేవత అయ్యారా ? 

90 శాతం మంది రైతులు దొడ్డు రకం వడ్లు వేస్తుంటే సన్నాలకే బోనస్సా?

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాందీని ముఖ్యఅతిథిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం చేసి.. 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆమెను పిలుస్తారా అని నిలదీశారు. సోనియాను ఆవిర్భావ ఉత్సవానికి పిలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సుష్మాస్వరాజ్‌ ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయిలో పోరాటం చేసిందని, తమ పార్టీ పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది కాబట్టే యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి సోనియాను దయ్యం అన్నారని, ఇప్పుడు ఆయనకు ఆమె దేవత అయ్యిందా అని ఎద్దేవా చేశారు. తమకు సోనియాగాంధీ అప్పుడూ ఇప్పుడూ దయ్యమేనని వ్యాఖ్యానించారు.  

రైతులకు రాష్ట్ర సర్కారు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం  
రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దగా చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ‘చెయ్యి’ ఇస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వలేదన్నారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటే రూ.1000 బోనస్‌ ఇవ్వాలని, దొడ్డు రకానికి రూ.500 బోనస్‌ ఇవ్వాలని చెప్పారు. దొడ్డు బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, రైతులకు ఇచి్చన హామీ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తో్తందన్నారు.తెలంగాణలో 90 శాతంమంది దొడ్డు రకం వడ్లు వేస్తుండగా, సన్నాలకే బోనస్‌ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు.  

రాష్ట్రంలో సకాలంలో ధాన్యం సేకరించలేకపోతున్నారు 
‘2023–24 ఒప్పందం ప్రకారం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదు. సకాలంలో ధాన్యం సేకరించలేకపోతోంది. అకాల వర్షాలతో ధాన్యం కల్లాలోనే తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 75 వేల టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోలు పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతోంది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.      

Advertisement
 
Advertisement
 
Advertisement