లీకేజీలో నమ్మలేని నిజాలు

BJP Leader Bandi Sanjay Comments On KCR Govt - Sakshi

గ్రూప్‌–1 పరీక్షలో బీఆర్‌ఎస్‌ నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారు 

ఒకే మండలం నుంచి 50 మందికిపైగా అర్హత సాధించారు 

లీకేజీకి కేటీఆరే బాధ్యుడు ఆయన్ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలి 

అతిత్వరలో వాస్తవాలు బయటపెడతాం.. అసలైన దోషులను సమాజం ముందుంచుతాం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పరీక్షలో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని... బీఆర్‌ఎస్‌ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పనిచేసే వాళ్లు గ్రూ­ప్‌–1 పరీక్షలో క్వాలిఫై అయినట్లు తమ­కు సమాచారం అందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆదివా­రం రాత్రి ఆయన ఒక ప్రకటన విడు­ద­ల చేశారు.

‘లక్షలాది మంది నిరుద్యోగు­లను వంచించిన కేసీఆర్‌ ప్రభుత్వం దీనిపై 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్‌–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్‌ కొడుకు నిర్వాకంపై అతిత్వరలో వాస్తవాలు బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతాం’అని సంజయ్‌ పేర్కొన్నారు. 

జెడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్‌విండో చైర్మన్‌ పిల్లలు క్వాలిఫై... 
‘జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అర్హత సాధించారు. వారంతా బీఆర్‌ఎస్‌ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లే.

నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్‌ విండో చైర్మన్‌ కొడుకుతోపాటు ఒక జెడ్పీటీసీ వద్ద బాడీగార్డ్‌గా పనిచేసే వ్యక్తి కొడుకు, ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యాడు. ఒక సర్పంచ్‌ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై చేశారు’అని సంజయ్‌ ఆరోపించారు. 

కేటీఆర్‌ సహకారంతోనే లీకేజీ... 
‘కేసీఆర్‌ కొడుకు మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే పేపర్‌ లీకేజీ జరిగింది. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ఉంది. తక్షణమే కేసీఆర్‌ కొడుకును కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలి’అని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌ నియమించిన సిట్‌తో విచారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని పునరుద్ఘాటించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్‌ కేసుల తరహాలోనే పేపర్‌ లీకేజీ కేసును సైతం సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని సంజయ్‌ ఆరోపించారు.   

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top